Begin typing your search above and press return to search.

మనోడు మంచులో జారిపోయి పాక్ కు చేరారా?

By:  Tupaki Desk   |   14 Jan 2020 6:02 AM GMT
మనోడు మంచులో జారిపోయి పాక్ కు చేరారా?
X
శత్రు విమానాన్ని ఛేజించుకుంటూ పాక్ సరిహద్దుల్లోకి దూసుకెళ్లి.. అక్కడ చిక్కుకుపోయిన అభినందన్ వర్ధమాన్ ఉదంతాన్ని చూశాం. ఇప్పుడు అందుకు భిన్నంగా పొరపాటున మంచులో జారిపోయి.. దాయాది పాకిస్థాన్ సరిహద్దుల్లో పడిపోయిన సైనిక ఉద్యోగి ఆచూకీ కోసం చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. భారత సైన్యానికి చెందిన హవల్దార్ రాజేంద్ర సింగ్ నేగి కోసం విపరీతంగా వెతుకుతోంది భారత ఆర్మీ.

జనవరి 8నుంచి ఆయన కనిపించకపోవటంపై రాజేంద్ర సతీమణి కన్నీరుమున్నీరు అవుతున్నారు. తన భర్త ఆచూకీ కోసం చర్యలు చేపట్టాలని ఆమె కోరుతున్నారు. డెహ్రాడూన్ లోని అంబీవాలా సైనిక కాలనీకి చెందిన రాజేంద్ర నేగి 2002లో భారతసైన్యంలో చేరారు. ఇటీవల ఆయన్ను కశ్మీరులోని అతి శీతల ప్రాంతమైన గుల్మార్గ్ కు బదిలీ చేశారు.

ఇదిలా ఉంటే.. ప్రమాదవశాత్తు మంచులో జారి పడిన అతడు.. జారుకుంటూ పోయి పాక్ సరిహద్దుల్లోకి పడినట్లుగా భావిస్తున్నారు. అప్పటి నుంచి అతడి గురించి వెతుకుతున్నా.. అతడి జాడ మాత్రం లభించని పరిస్థితి. అతడ్ని స్వదేశానికి తీసుకురావటం కోసం భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేయాలని రాజేంద్ర సతీమణి రాజేశ్వరి కోరుతున్నారు.

ఇదిలా ఉంటే..హవల్దార్ రాజేంద్ర సింగ్ నేగిని వెతికి.. రక్షించే కార్యక్రమాన్ని తాము చేపట్టినట్లుగా చెబుతున్నారు. ఆయన్ను క్షేమంగా ఇంటికి తీసుకొచ్చేందుకు వీలుగా అన్ని కార్యక్రమాల్ని చేపట్టినట్లుగా పేర్కొన్నారు. మరి.. నేగి ఆచూకీ ఎక్కడన్నది తేలటం లేదు. రోజులు గడుస్తున్న కొద్దీ ఆందోళనలు అంతకంతకూ ఎక్కువ కావటమే కాదు.. అపాయం మరింత పెరుగుతుందని చెప్పక తప్పదు. మరి.. మనోడు ఇప్పుడెక్కడ అన్నది పెద్ద క్వశ్చన్ గా మారింది.