Begin typing your search above and press return to search.

ఆ ప్రాంతాల్లో ఎత్తు నిబంధ‌న‌ను సడ‌లించిన ఆర్మీ!

By:  Tupaki Desk   |   25 Oct 2017 8:00 AM GMT
ఆ ప్రాంతాల్లో ఎత్తు నిబంధ‌న‌ను సడ‌లించిన ఆర్మీ!
X
హిమాలయన్ రాష్ట్రాల్లోని అభ్యర్థులకు కనీస ఎత్తును త‌గ్గిస్తూ భారత సైన్యం ఈ ఏడాది ఆగ‌స్టులో నిర్ణయం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఆ నిర్ణ‌యం ప‌ట్ల‌ ఆ ప్రాంత ప్ర‌జ‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఆ నిబంధ‌న సడ‌లింపుతో తాజాగా నిర్వ‌హిస్తున్న శిబిరంలో ద‌ర‌ఖాస్తు చేసుకునే వారి సంఖ్య గ‌ణ‌నీయంగా పెరిగిపోయింది. దీంతో, ద‌రఖాస్తు చేసుకునేందుకు అభ్య‌ర్థులు నియామక శిక్షణా శిబిరాల వ‌ద్ద బారులు తీరుతున్నారు. ఒక్క‌ ఉత్తరాఖండ్ నుంచే 30% అధికంగా ద‌ర‌ఖాస్తులు రావ‌డం విశేషం. ఈ ఏడాది ఆగస్టులో క‌నీస ఎత్తును 166 సెం.మీ నుంచి 163 సెం.మీ. వరకు త‌గ్గిస్తూ ఆర్మీ నిర్ణ‌యం తీసుకుంది. అయితే, పశ్చిమ హిమాలయన్ ప్రాంతాలకు చెందిన జమ్మూ కాశ్మీర్ - హిమాచల్ ప్రదేశ్ - పంజాబ్ - ఉత్తరాఖండ్ లోని గర్వాల్ - కుమోన్లకు చెందినవారికి మాత్ర‌మే ఈ స‌డ‌లింపు వ‌ర్తిస్తుంది. స‌డ‌లించిన నిబంధ‌న వ‌ల్ల గతంలో ఎత్తు స‌రిపోక ఎంపిక కాని అభ్య‌ర్థులు కూడా తాజా శిబిరాల‌కు హాజ‌రవుతున్నార‌ని ఆర్మీ రిక్రూట్ మెంట్ అధికారులు తెలిపారు.

ఈ ఏడాది ఏప్రిల్లో చమోలి జిల్లాలో గౌచార్లో ఆర్మీ నిర్వహించిన నియామకాల్లో 18,000 మంది యువకులు పాల్గొన్నారు. అక్టోబర్లో డెహ్రాడూన్లో నిర్వ‌హించిన రిక్రూట్మెంట్ డ్రైవ్ లో 22,000 మంది పాల్గొన్నారు. అక్టోబరు 1 నుంచి కొత్త నిబంధ‌న అమలులోకి వచ్చిన తర్వాత ఉత్తరాఖండ్లో సైన్యం నిర్వహించిన మొట్టమొదటి నియామక డ్రైవ్ ఇదే కావ‌డం విశేషం. ఆగస్టులో ఆర్మీ కనీస ఎత్తు నిబంధ‌న‌ను స‌డ‌లించిన త‌ర్వాత ముందస్తు నియామక శిబిరాలకు దరఖాస్తుదారుల సంఖ్య సెప్టెంబరులో 30% పెరిగిందని నిర్వాహ‌కులు చెబుతున్నారు. వ‌చ్చే నవంబర్ లో ప్రారంభంకానున్న శిబిరానికి ఇంకా 70% ఎక్కువ అప్లికేషన్లు వ‌స్తాయ‌ని ఆశిస్తున్నామ‌న్నారు. మారుమూల ప్రాంతాల్లో - గ్రామాల్లో ఉన్న చాలామందికి ఈ కొత్త నిబంధ‌న గురించి తెల‌య‌ద‌ని - అందువ‌ల్ల త‌ర్వాతి క్యాంపు స‌మ‌యానికి మ‌రిన్ని ద‌ర‌ఖాస్తులు వ‌స్తాయ‌ని ఆశిస్తున్నామ‌న్నారు.

ప్ర‌తి ఏటా ఆర్మీ రెండు సార్లు రిక్రూట్మెంట్ డ్రైవులు చేప‌డుతుంది. వ‌చ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో ఉత్తరకాశి - రుద్రప్రయాగ్ - చమోలి - తెహ్రీల‌లో ఈ క్యాంపులు ఏర్పాటు చేయాల‌ని ఆర్మీ భావిస్తోంది. స‌డ‌లించిన నిబంధ‌న వ‌ల్ల ఆ క్యాంపుల‌కు మ‌రింత‌మంది ద‌ర‌ఖాస్తుదారులు వ‌స్తార‌ని అధికారులు భావిస్తున్నారు. పౌరీకి చెందిన అమిత్ కుమార్ (20).... గురుచార్లో సైన్యం నిర్వహించిన భౌతిక పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. అమిత్ ఎత్తు 165cm. దీంతో - ఆర్మీ రెండుసార్లు అత‌డిని తిరస్కరించింది. కొత్త నిబంధ‌న వ‌ల్ల అత‌డు అర్హ‌త సాధించాడు. ప్ర‌స్తుతం వ‌చ్చే నెల‌లో జ‌రిగే రాత ప‌రీక్ష‌కు సిద్ధ‌మ‌వుతున్నాన‌ని అమిత్ చెప్పాడు. అమిత్ లాగే, 1 - 2 సెం.మీ ఎత్తు తేడాతో చాలామంది అభ్య‌ర్థులు తిరస్కరణకు గుర‌య్యారు. ఆర్మీ అధికారులు కొత్త నిబంధ‌న‌ను ప్ర‌వేశ‌పెట్ట‌డంతో సైనికులు కావాల‌న్న వారంద‌రి క‌ల నెర‌వేరేందుకు మార్గం సుగ‌మ‌మైంది. ఆ కొత్త నిబంధ‌న త‌మ జీవితాల్లో వెలుగులు నింపింద‌ని ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. ఆర్మీ నిర్ణ‌యం ప‌ట్ల ఆ ప్రాంతాల్లోని అభ్య‌ర్థులంద‌రూ హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.