Begin typing your search above and press return to search.

భారత ఆర్మీ దాడుల్లో అల్ ఖైదా చీఫ్ హతం

By:  Tupaki Desk   |   23 Oct 2019 11:45 AM GMT
భారత ఆర్మీ దాడుల్లో అల్ ఖైదా చీఫ్ హతం
X
గడిచిన మూడు రోజులుగా దాయాదితో సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితి తెలిసిందే. పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాకిస్థాన్ కు దిమ్మ తిరిగిపోయేలా షాకిస్తున్న భారత బలగాలతో దాయాది తెగ ఇబ్బంది పడుతోంది. అయినప్పటికి కుక్క తోక వంకర మాదిరి.. తన పాడు బుద్ధిని ఎప్పటికప్పుడు ప్రదర్శిస్తూనే ఉంది.

ఒకవైపు తాను నష్టపోతూనే.. మరోవైపు భారత్ ను దెబ్బ తీసే ప్రయత్నాల్ని ఆపటం లేదు. నిబంధనలకు విరుద్ధంగా కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘించి మరీ కాల్పులు జరుపుతున్న పాక్ కు ధీటుగా సమాధానం ఇస్తోంది భారత సైనిక వర్గాలు. పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విదేశీ పాత్రికేయులు ఉన్నారని.. వారికి హాని కలుగుతుందని పేర్కొంటూ కాల్పులు జరపొద్దంటూ పాక్ కోరింది. కాసేపటికే తన మాటను పక్కన పెట్టి భారత్ మీద కాల్పులకు తెగ బడింది. దీంతో.. ఇద్దరు జవాన్లు.. ఒక పౌరుడు మరణించాడు.

దీనికి ప్రతీకారంగా ఆదివారం ఇండియన్ ఆర్మీ ఆర్టిలరీ శతఘ్నులతో తీవ్రస్థాయిలో విరుచుకుపడటం తెలిసిందే. మంగళవారం జరిగి భారత ఆర్మీ భీకర దాడిలో పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఉన్న 50 మంది ఉగ్రవాదులు మరణించినట్లుగా చెబుతున్నారు. వారే కాక మరో ఏడుగురుపాక్ జవాన్లు మరణించినట్లు సమాచారం.

కశ్మీర్ లో ఉగ్రవాద ఏరివేత ఆపరేషన్ ను తీవ్రతరం చేసిన ఇండియన్ ఆర్మీ.. అనుకోని రీతిలో ఆల్ ఖైదా కశ్మీర్ చీఫ్ ను హతమార్చినట్లుగా చెబుతున్నారు. ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ లో మరణించిన ఇద్దరు ఉగ్రవాదుల్లో అల్ ఖైదా చీఫ్ ఉన్నట్లు తెలుస్తోంది.