Begin typing your search above and press return to search.

సైనికుడి వీడియో ఎఫెక్ట్ ఎంతంటే..

By:  Tupaki Desk   |   17 Jan 2017 9:20 AM GMT
సైనికుడి వీడియో ఎఫెక్ట్ ఎంతంటే..
X
నిలువెత్తు నిర్లక్ష్యం అన్న మాట కూడా సరిపోనంత దుర్మార్గాన్ని తన వీడియోతో ప్రపంచానికి తెలిసేలా చేశారు తేజ్ బహదూర్ అనే జవాను. ప్రతికూల వాతావరణంలో.. ప్రాణాల్ని పణంగా పెట్టి సరిహద్దు భద్రతా విధులు నిర్వర్తించే జవాన్లకు అందుతున్న ఆహారం మీద అతగాడి వీడియో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రభుత్వం విధానాలు బాగానే ఉన్నా..వాటిని అమలులోనేఅసలు సమస్య అంతా అంటూ పందికొక్కుల వ్యవహారాన్ని తెలివిగా వెలుగులోకి తెచ్చిన తీరుతో ఒక్కసారిగా కదలిక మొదలైంది.

ఈ వీడియో విడుదలైన గంటల్లోనే కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ దృష్టి సారించటమే కాదు.. మొత్తం వ్యవస్థను ప్రక్షాళన చేయాలన్న ఆదేశాలతో సీన్ మొత్తం మారిపోయినట్లుగా చెబుతున్నారు. సైన్యానికి సరైన ఆహారం అందకుండా చేస్తున్న వైనంపై దృష్టి సారించేందుకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి.. వరుస దాడుల్ని నిర్వహిస్తున్నారు.

సైనికులకు అందించాల్సిన మెనూ సంబంధించిన ఆహారపదార్థాలు ఎక్కడ కొనుగోలు చేస్తున్నారు? ఏమేరకు చేస్తున్నారు? వాటి వినియోగం ఏమిటి? లాంటి అంశాల మీద ఉన్నతాధికారులు దాడులు చేయటం.. సైనికులకు అందే మెనూ సక్రమంగా అందుతుందా? లేదా? అన్న అంశంపై ప్రత్యేక దృష్టిని సారిస్తున్నారు. దీంతో.. మొత్తంగా పరిస్థితిలో మార్పు వచ్చిందని చెబుతున్నారు.

గతానికి భిన్నంగా అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలోని ఆర్ ఎస్ పుర లో ఉన్న మెస్ లో తయారు చేస్తున్న మెనూచూస్తే.. రోటీ.. చేప కూర.. జున్ను.. పప్పు ఉండేలా చర్యలు తీసుకున్నారు. ప్రతి జవానుకు 3వేల కేలరీలు అందేలా ఆహారాన్ని అందిస్తామని.. ఎత్తైన ప్రదేశాల్లో.. ఇబ్బందికర వాతావరణం చోట విధులు నిర్వర్తించే సైనికులకు 3600 కేలరీలు అందేలా డైట్ అందించేలా ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా చెబుతున్నారు. సోషల్ మీడియాలో వీడియో పెట్టటంపై సైనిక వర్గాలు.. ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ.. తేజ్ బహదూర్ పుణ్యమా అని మెనూ మొత్తం మారిందని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/