Begin typing your search above and press return to search.

మోదీకి సైన్యం చేదు వార్త చెప్పేసిందిగా!

By:  Tupaki Desk   |   22 Jun 2017 6:04 AM GMT
మోదీకి సైన్యం చేదు వార్త చెప్పేసిందిగా!
X
గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో త‌న‌దైన శైలిలో ప్ర‌చారం నిర్వ‌హించి ఊహించ‌ని మెజారిటీతో కేంద్రంలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన నాటి గుజ‌రాత్ సీఎం న‌రేంద్ర మోదీ... ఆ వెంట‌నే గుజ‌రాత్ సీఎం పోస్టుకు రాజీనామా చేసేసి... దేశ ప్ర‌ధాన మంత్రి ప‌ద‌విని అధిష్టించారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఎంత స్పీడు చూపారో... పాల‌న‌లోనే అంతే స్పీడు చూపిన మోదీ లెక్క‌లేన‌న్ని కొత్త ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెట్టారు. అలాంటి కొత్త ప‌థ‌కాల్లో మేకిన్ ఇండియా చెప్పుకోద‌గ్గ‌ది. ఈ కార్య‌క్ర‌మానికి మించి మంచి ప్రాచుర్యం ల‌భించిన స్వ‌చ్ఛ భార‌త్ ఉన్న‌ప్ప‌టికీ... మేకిన్ ఇండియా స‌క్సెస్ అయితే దేశ రూపురేఖ‌లే మారిపోతాయ‌న్న‌ది నిపుణుల మాట‌. మోదీ ల‌క్ష్యం కూడా అదే.

అనుకున్న‌దే త‌డ‌వుగా ఎర్ర‌కోట నుంచి చేసిన తొలి ప్ర‌సంగంలోనే మోదీ మేకిన్ ఇండియా నినాదాన్ని వినిపించారు. భార‌త్‌లో వినియోగించే వ‌స్తువుల‌ను దేశీయంగానే ఉత్ప‌త్తి చేసుకోవాల‌న్న‌ది ఈ ప‌థ‌కం ల‌క్ష్యం అయిన‌ప్ప‌టికీ... ప్ర‌పంచ దేశాల‌కు ఉత్ప‌త్తి రంగంలో భార‌త్‌ ను కేంద్ర బిందువుగా మార్చాల‌న్న‌ది విశాల దృక్ప‌థంగా బీజేపీ నేత‌లు చెబుతారు. ప్ర‌ధాని ప్ర‌క‌ట‌న త‌ర్వాత పారిశ్రామికీక‌ర‌ణ‌లో బాగానే మార్పులు వ‌చ్చినా... వాటి ఫ‌లితాలు మాత్రం ఇంకా అంద‌లేద‌నే చెప్పాలి. ఫ‌లితాలు అందాయనే కంటే కూడా... మొద‌టి మెట్టులోనే మోదీ ఆశ‌యం స‌క్సెస్ కాలేద‌ని చెప్పొచ్చు.

ఎందుకంటే... మొన్న‌టిదాకా సైన్యానికి కావాల్సిన ఆయుధాల‌ను ఇత‌ర దేశాల నుంచి దిగుమ‌తి చేసుకునే వాళ్లం. అయితే మోతీ మేకిన్ ఇండియా మంత్రం నేప‌థ్యంలో ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌తో పాటు ప్రైవేటు రంగ సంస్థ‌లు కూడా దేశీయంగానే ఉత్ప‌త్తి యూనిట్ల‌ను ప్రారంభించాయి. ఇలాంటి వాటిలో సైన్యానికి అవ‌స‌ర‌మైన ఆయుధాల‌ను త‌యారు చేసేందుకు ఇషాపూర్‌లో ఓ ఫ్యాక్ట‌రీ ఏర్పాటైపోయింది. ఈ ఫ్యాక్ట‌రీ రికార్డు కాలంలోనే ఉత్ప‌త్తి ప్రారంభించ‌గా... సైన్యానికి అవ‌స‌ర‌మైన రైఫిళ్ల‌ను త‌యారు చేసింది. గ‌తేడాదే తాము త‌యారు చేసిన రైఫిళ్ల‌ను సైన్యానికి అందించిన ఈ ఫ్యాక్టరీ... వాటిని ప‌రిశీలించాల‌ని కోరింది. అయితే నాణ్య‌తాప్ర‌మాణాల్లో ఆ రైఫిళ్లు అంత బాగా లేవ‌ని, తాము వినియోగించేంత స‌త్తా కూడా ఆ తుపాకుల‌కు లేవ‌ని సైన్యం తేల్చి చెప్పింది.

అయితే మేకిన్ ఇండియా నినాదాన్ని బాగానే ఒంట‌బ‌ట్టించుకున్న స‌ద‌రు ఫ్యాక్ట‌రీ... ఆ తుపాకుల‌ను మ‌రింత నాణ్య‌తా ప్ర‌యాణాల‌తో అభివృద్ది చేసి ఇటీవ‌లే సైన్యం చేతిలో పెట్టేసింద‌ట‌. అయితే రెండో ప‌ర్యాయం త‌మ చేతికి అందిన స‌ద‌రు ఫ్యాక్ట‌రీ తుపాకులు నాణ్య‌త‌లో పాస్ కాలేద‌ని సైన్యం తేల్చేసింది. దీంతో షాక్ తిన్న స‌ద‌రు క‌ర్మాగారం ఏం చేయాలో పాలుపోక త‌ల ప‌ట్టుకుందట‌. మ‌రి ఈ విష‌యం మోదీ చెవిన ప‌డిందో, లేదో తెలియ‌దు గానీ... ప్ర‌పంచ త‌యారీ రంగానికి భార‌త్ సెంట‌ర్‌ గా మారాలంటే మాత్రం మ‌నోళ్లు మ‌రింత‌గా శ్రమించ‌క త‌ప్ప‌ద‌న్న వాద‌న వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/