Begin typing your search above and press return to search.

చేతల్లో చూపిస్తే తెలుస్తుందిగా..?

By:  Tupaki Desk   |   21 July 2015 10:04 AM GMT
చేతల్లో చూపిస్తే తెలుస్తుందిగా..?
X
గత కొద్దిరోజులుగా దేశ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ.. పాకిస్థాన్ పదే పదే రెచ్చగొట్టేలా కవ్వింపు చర్యలకు పాల్పడటం తెలిసిందే. ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేని విధంగా.. రంజాన్ సందర్భంగా సరిహద్దుల్లోని సైనికులు పరస్పరం ఇచ్చిపుచ్చుకునే మిఠాయిల్ని తీసుకోవటం బంద్ చేసిన సంగతి తెలిసిందే.

పాక్ చేసే కవ్వింపు చర్యలకు బదులిచ్చే క్రమంలో అప్పుడప్పడు గట్టిగా బదులిచ్చే క్రమంలో భారత సైన్యం కాల్పులు జరుపుతుంటుంది. తాజాగా ఇలా జరిపిన కాల్పుల్లో ఒక బాలిక మరణించిన అంశంపై లెఫ్టినెంట్ జనరల్ కేహెచ్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. అదే సమయంలో పాక్ వైఖరిని ఆయన తీవ్రంగా ఖండించారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదే పదే ఉల్లంఘిస్తున్న పాక్ కు గట్టిగా బుద్ధి చెప్పగలమని.. తాము సైతం ఊహించని దాడులు చేస్తామని ఆయన వార్నింగ్ ఇస్తున్నారు.

కుక్క తోక వంకర మాదిరి.. పాక్ లాంటి దేశానికి మాటలతో కాకుండా చేతల్లో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్న వాదన వినిపిస్తోంది. యుద్ధానికి కాలు దువ్వటం కాకున్నా.. అడుగు ముందుకేస్తే.. ఎందుకు ఆ పని చేశామా? అన్న బాధ కలిగేలా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మాటలతో వేడి పుట్టించేకన్నా.. చేయాల్సిన పని చేతల్లో చేసి చూపిస్తే మంచిదన్న కోణంలో ఆలోచిస్తే బాగుంటుందన్నది కొందరి వాదన. మరి.. భారత సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.