Begin typing your search above and press return to search.

స్టార్‌బక్స్ సీఈఓగా భారతీయుడు!

By:  Tupaki Desk   |   2 Sep 2022 5:19 AM GMT
స్టార్‌బక్స్ సీఈఓగా భారతీయుడు!
X
వాళ్లంతా భారత్ లో చదువుకొని.. భారత్ లో ఎదిగి.. భారత్ వల్లే ఇప్పుడు అత్యున్నత హోదాలో ఉన్నారు. మైక్రో సాఫ్ట్ సీఈవో ఎవరు..? సత్యానాదెళ్ల. ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ సీఈవో ఎవరు..? అదీ మనోడే.. సుందర్ పిచాయ్. వీరిద్దరే కాదు.. అడోబ్ సీఈవో శంతను నారాయణ్, మాస్టర్ కార్డ్ సీఈవో అజయ్ బంగా వీరేకాదు.. చాలా ప్రపంచ కార్పొరేట్ సంస్థలకు మన భారతీయులే సీఈవోలుగా ఉన్నారు. సత్తా చాటుతున్నారు.

ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక సంస్థకు సీఈవోగా మరో భారతీయుడు నియామకం అయ్యాడు. స్టార్‌బక్స్ తన తదుపరి చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా లక్ష్మణ్ నరసింహన్‌ను నియమించుకున్నట్లు కంపెనీ గురువారం ప్రకటించింది, ప్రపంచంలోని అతిపెద్ద కాఫీ చైన్‌కు ఆయనను ఇన్‌ఛార్జ్‌గా నియమిస్తోంది. ఏప్రిల్‌లో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 35,000 దుకాణాలు మరియు 383,000 మంది ఉద్యోగులను పర్యవేక్షిస్తూ, 55 ఏళ్ల నరసింహన్ ప్రపంచంలోని అత్యంత ప్రముఖమైన కార్పొరేట్ బాధ్యతలను స్వీకరించబోతున్నారు. మాజీ సీనియర్ పెప్సికో ఎగ్జిక్యూటివ్ గా ఈయన గతంలో పనిచేశారు. ఇటీవల లైసోల్ క్రిమిసంహారక మరియు డ్యూరెక్స్ కండోమ్‌లను తయారుచేసే బ్రిటిష్ సమ్మేళనమైన రెకిట్ బెంకిజర్‌ కంపెనీ సీఈవోగా నడిపించాడు.

భారతదేశంలోని పూణేలో జన్మించిన నరసింహన్ 1991లో పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలోని వార్టన్ స్కూల్‌లో చేరేందుకు యునైటెడ్ స్టేట్స్‌కు వెళ్లారు. కన్సల్టింగ్ దిగ్గజం మెకిన్సే & కంపెనీలో మొదట చేరాడు. అందులోనే సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా ఎదిగాడు. 2012లో అతను పెప్సికో కంపెనీలోకి మారాడు. లాటిన్ అమెరికా, యూరప్ మరియు సబ్-సహారా ఆఫ్రికాలో కార్యకలాపాలను పర్యవేక్షిస్తూ ఆయా దేశాల్లో కంపెనీని విస్తరించారు. అనంతరం చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ అయ్యాడు.

శిశు ఉత్పత్తుల తయారీ సంస్థ మీడ్ జాన్సన్‌ను 16.6 బిలియన్ డాలర్లు స్వాధీనం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. 2019లో రెకిట్‌లో సీఈవోగా నియమించబడ్డాడు. పనితీరు లేని కార్యకలాపాలను విక్రయించడం, కరోనా మహమ్మారి సమయంలో కంపెనీని మెరుగ్గా నడిపించి పెట్టుబడిదారులు విశ్లేషకుల నుండి ప్రశంసలు అందుకున్నాడు.

ఏ కంపెనీలో ఉన్నా సమర్ధుడిగా పేరు తెచ్చుకున్న నరసింహన్ చివరకు అత్యున్నత స్టార్ బక్స్ సీఈవోగా నియమితుడయ్యాడు. మరో భారతీయుడి చెంతకు మరో ప్రతిష్టాత్మక కంపెనీ చేరడంపై భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.