Begin typing your search above and press return to search.

బ్యాంకుల దెబ్బకు మాల్యాకు కిక్కు దిగింది

By:  Tupaki Desk   |   7 April 2016 7:52 AM GMT
బ్యాంకుల దెబ్బకు మాల్యాకు  కిక్కు దిగింది
X
బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేసి... ఆ తరువాత రూ. 4 వేల కోట్లను చెల్లిస్తానంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విజయ్ మాల్యాకు తాజాగా షాక్ తగిలింది. విజయ్‌ మాల్యా రుణ ఎగవేత కేసుపై గురువారం సుప్రీం కోర్టులో విచారణకు రాగా.. రూ.4వేల కోట్లు చెల్లిస్తానన్న మాల్యా ప్రతిపాదనను బ్యాంకులు తిరస్కరించాయి. రూ.9వేల కోట్లు చెల్లించాలని పట్టుపట్టాయి. ఈ మేరకు కోర్టుకు తమ ఉద్దేశాన్ని స్పష్టంగా చెప్పాయి. బ్యాంకుల ప్రతిపాదనపై కింగ్‌ ఫిషర్‌ యాజమాన్యం 2 వారాల గడువు కోరింది.

బ్యాంకులకు బకాయి పడ్డ 9 వేల కోట్లలో 4 వేల కోట్లను చెల్లిస్తానంటూ కింగ్‌ ఫిషర్‌ అధినేత విజయ్‌ మాల్యా ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. అయితే... స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పడిన బ్యాంకుల కన్సార్టియం ఆ ప్రపోజల్ ను తిరస్కరించింది. ఈ మేరకు బ్యాంకుల కన్సార్టియం సుప్రీంకోర్టుకు తన అభిప్రాయాన్ని తెలియజేసింది. విజయ్‌ మాల్యా బ్యాంకులకు 9091 కోట్ల రూపాయిల బకాయిలను తిరిగి చెల్లించాల్సి ఉంది. కాగా, అతడు రుణాలు ఎగ్గొట్టి దేశం విడిచి వెళ్లిపోయాడు. 4 వేల రూపాయిలను చెల్లిస్తానని, తనను వేధించడం మానేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో అతడు పిటిషన్‌ దాఖలు చేశాడు. దీనిపై సుప్రీంకోర్టు బ్యాంకుల అభిప్రాయాన్ని కోరగా అవి ససేమిరా అన్నాయి. దీంతో విజయమాల్యాకు చిక్కులు తప్పేలా లేవు.