Begin typing your search above and press return to search.

మన దేశంలోని 63 మంది బిలియనీర్ల ఏడాది సంపాదన ఎంతంటే ?

By:  Tupaki Desk   |   20 Jan 2020 8:46 AM GMT
మన దేశంలోని 63 మంది  బిలియనీర్ల ఏడాది సంపాదన ఎంతంటే ?
X
భారత్‌ లో ఉండే 63 మంది బిలియనీర్ల సంపద 2018-19 కేంద్ర బడ్జెట్‌ కంటే అధికమని తాజా అథ్యయనం వెల్లడించింది. 2018-19 కేంద్ర బడ్జెట్‌ రూ 24.42 లక్షల కోట్లు. దేశంలో కేవలం ఒక్క శాతంగా ఉన్న సంపన్నుల సంపద 70 శాతం జనాభా 95.3 కోట్ల మంది వద్ద ఉన్న సంపద కంటే నాలుగు రెట్లు అధికమని వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం కు చెందిన హక్కుల సంస్థ ఆక్స్‌ ఫాం నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఇదే ధోరణి కొనసాగుతోందని ఆర్థిక అసమానతలు ఎంతలా విస్తరించాయో ఆక్స్‌ ఫాం కళ్లకు కట్టింది. డబ్ల్యూఈఎఫ్‌ 50వ వార్షిక సమావేశానికి ముందు టైమ్‌ టూ కేర్‌ పేరుతో ఆక్స్‌ ఫాం ఈ నివేదికను వెల్లడించింది.

ప్రపంచవ్యాప్తంగా 2,153 మంది బిలియనీర్ల సంపద విశ్వవ్యాప్తంగా 60 శాతంగా ఉన్న 460 కోట్ల మంది వద్ద పోగుపడిన సంపద కంటే అధికమని తెలిపింది. దశాబ్ధంలో బిలియనీర్ల సంఖ్య రెట్టింపవడంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అసమానతలు మరింత పెరగడం ఆందోళనకరమని ఈ సంస్థ అభిప్రాయం వ్యక్తం చేసింది. ధనిక, పేదల మధ్య వ్యత్యాసం తగ్గించేందుకు సరైన విధానపరమైన చర్యలు అవసరమైని, కేవలం కొన్ని ప్రభుత్వాలే దీనికి కట్టుబడిఉన్నాయని ఆక్స్‌ఫాం ఇండియా సీఈవో అమితాబ్‌ బెహర్‌ తెలిపారు.

సాధారణ ప్రజలు ముఖ్యంగా పేద మహిళలు, చిన్నారుల శ్రమకు సరైన ప్రతిఫలం దక్కడం లేదని, వారి ప్రయోజనాలను పణంగా పెట్టి సంపన్నులు పైమెట్టుకు చేరుతున్నారని నివేదిక ఆవేదన వ్యక్తం చేసింది. టెక్నాలజీ కంపెనీ సీఈవో తీసుకునే వార్షిక వేతనాన్ని ఇంటి పనులు చేసే మహిళా కార్మికురాలు అందుకోవాలంటే ఏకంగా 22,227 సంవత్సరాలు పడుతుందని నివేదిక అంచనా వేసింది. మహిళలు, చిన్నారులు చేస్తున్న పనులకు సరైన వేతనం దక్కడం లేదని వెల్లడించింది.