Begin typing your search above and press return to search.

భారత్ బయోటెక్ మాట.. ‘మా వ్యాక్సిన్ సురక్షితం.. నో సైడ్ ఎఫెక్ట్స్’

By:  Tupaki Desk   |   17 Dec 2020 12:40 PM GMT
భారత్ బయోటెక్ మాట.. ‘మా వ్యాక్సిన్ సురక్షితం.. నో సైడ్ ఎఫెక్ట్స్’
X
ప్రపంచానికి కునుకు లేకుండా చేసిన కరోనాకు వ్యాక్సిన్ ఇప్పటికే అందుబాటులోకి రావటం.. పలు దేశాల్లో వ్యాక్సిన్ ఇవ్వటం తెలిసిందే. అయితే..కొన్నిచోట్ల ఇస్తున్న వ్యాక్సిన్ కు సైడ్ ఎఫెక్టులు వస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇలాంటివేళ.. భారత్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ తాజాగా తమ టీకాకు సంబంధించిన ఆసక్తికర వివరాల్ని వెల్లడించింది.

కోవాగ్జిన్ పేరుతో భారత్ బయోటెక్ టీకాను తీసుకొస్తోంది. దీనికి సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ ను నిర్వహిస్తున్నారు. 22 వేల మందితో మూడో దశ ట్రయల్స్ ను చేపట్టారు. దీనికి సంబంధించిన ఫలితాల్ని తాజాగా వెల్లడించారు. కంపెనీ ముఖ్యులు చెబుతున్న దాని ప్రకారం.. తమ వ్యాక్సిన్ తో ఎలాంటి దుష్ప్రభావాలకు గురి కాలేదని తెలిపారు. నవంబరు 17 నుంచి మూడో దశ పరీక్షల్ని నిర్వహించామని.. ఆగస్టులో వ్యాక్సిన్ ట్రయల్స్ వేసిన సమయంలో ఒకే ఒక్క కేసులో తీవ్ర సమస్య ఎదురైందని.. అయితే అది టీకా కారణంగా కాదని పేర్కొన్నారు.
కంపెనీ సీఎండీ క్రిష్ణా ఎల్లా మాట్లాడుతూ.. 11 ఆసుపత్రుల్లో 375 మంది వాలంటీర్ల మీద తొలిదశలో ప్రయోగాలు చేపట్టినట్లుగా తెలిపారు. మూడు విభిన్నమైన డోసుల్ని ఇచ్చామని.. అన్నింటిలోనూ రోగనిరోధక శక్తి అత్యుత్తమంగా ఉన్నట్లుగా తెలియజేశారు. ఈ హైదరాబాదీ కంపెనీ ఫలితాలు బాగుండటంతో దేశానికి సానుకూలత మరింత పెరుగుతుందని చెబుతున్నారు.

తొలిదశ క్లినికల్ టెస్టుల్లో ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదని.. మొదటి రెండు దశల క్లినికల్ పరీక్షల డేటాను అనుసరించి కంపెనీ మార్కెటింగ్ హక్కుల కోసం అప్లై చేసినట్లు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. ఇప్పటివరకు వచ్చిన ఫలితాల ప్రకారం కొవాగ్జిన్ తో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. మూడో దశ పరీక్షల తుది ఫలితం ఆదే రీతిలో ఉంటే.. ఈ టీకాకు వచ్చే ఆదరణ ప్రపంచ వ్యాప్తంగా భారత్ పరపతిని మరింత పెంచుతుందని చెప్పక తప్పదు.