Begin typing your search above and press return to search.

మన కమాండోలు చెప్పిన తాలిబన్ ఆఘాయిత్యాలు

By:  Tupaki Desk   |   22 Aug 2021 5:29 AM GMT
మన కమాండోలు చెప్పిన తాలిబన్ ఆఘాయిత్యాలు
X
అఫ్గాన్ ను అక్రమించుకున్న తాలిబన్లు ఏం చేస్తున్నారన్న ప్రశ్నను వేసినంతనే.. బోలెడన్ని ఆఘాయిత్యాలు.. ఆవేదన ఘటనలు బయటకు వస్తాయి. ఇవన్నీ కూడా విదేశీ మీడియాలో వచ్చే కథనాలకు ప్రతిరూపం. అయితే.. అందుకు భిన్నం ఇప్పుడు చెప్పే సంగతులన్ని. భారత్ కు చెందిన ఐటీబీటీ కమాండోలు అఫ్గాన్ లోని రాయబార కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తుంటారు. కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు హుటాహుటిన భారత్ కు వచ్చేసిన వారిలో కొందరు తెలుగు ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు.

తాలిబన్ల చేతికి అఫ్గాన్ వెళ్లిన తర్వాత అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయన్న విషయాల్ని వారు చెప్పినంతనే.. అయ్యో అఫ్గాన్లు అనుకోకుండా ఉండలేం. దారుణాలకు నిలువెత్తు రూపంగా.. ఆఘాయిత్యాలకు కేరాఫ్ అడ్రస్ గా వారి తీరు ఉందనిపించక మానదు. ఇంతకీ మన కమాండోలు తాలిబన్ల గురించి ఏం చెప్పారన్నది చూస్తే..

అఫ్గాన్ నరకాన్ని తలపిస్తోంది. అక్కడ మనుషుల ప్రాణాలకు అస్సలు విలువ లేదు. తమకు తేడా అనిపిస్తే పిట్టల్ని కాల్చినట్లు కాల్చేస్తారు. వారి మాటల్ని పెద్దగా పట్టించుకోని తీరు అక్కడ కనిపిస్తుంది. కేంద్రం నుంచి సమాచారం వచ్చినంతనే కాందహార్ విమానాశ్రయానికి చేరుకొని ఢిల్లీకి వచ్చేశాం. ఆగస్టు 13న మాకు ఫోన్ వచ్చింది. రాయబార కార్యాలయంలో ఉన్న 350 మందిని తీసుకొని సురక్షితంగా వచ్చేయాలని ఆదేశాలు వచ్చాయి.

దీంతో హడావుడిగా బయలుదేరాం. ఎయిర్ పోర్టుకి తీసుకొచ్చేందుకు వాహనాలు ఎక్కించాం. ఏ దారిలో వెళ్లినా తాలిబన్లు అడ్డుకున్నారు. అక్కడే ఉండాలని అడ్డుకున్నారు. భారతీయుల మీద తాలిబన్లలో పెద్దగా వ్యతిరేకత వ్యక్తం కాలేదు. వేరే దారి నుంచి ఎయిర్ పోర్టుకు వెళుతుంటే.. మాకు దగ్గర్లోని కారులో ఐఈడీ పేలి అందులోని వారంతా తనాతునకలయ్యారు. అది చూసినంతనే వణుకు పుట్టింది.

ఒకచోట బుర్ఖా ధరించిన ఒక విదేశీ మహిళతో కొందరు తాలిబన్లు మాట్లాడుతున్నారు. అంతలోనే ఆమెను మోకాళ్ల మీద కూర్చోబెట్టి.. తలపై రివాల్వర్ తో కాల్చటంతో ఆమె అక్కడికక్కడే కూలిపోయింది.ఇలాంటి ఘటనలు మా అందరిలో ఆవేదనను కలిగించాయి. అవరోధాల్ని ఎదుర్కొని ఎయిర్ పోర్టుకు చేరి.. అక్కడి నుంచి సురక్షితంగా ఢిల్లీకి వచ్చేశామని తమ అనుభవాల్ని వారు చెప్పారు.