Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో తయారవుతున్న కోవిడ్ ట్యాబ్లెట్లు వచ్చేస్తున్నాయ్

By:  Tupaki Desk   |   24 July 2020 5:31 AM GMT
హైదరాబాద్ లో తయారవుతున్న కోవిడ్ ట్యాబ్లెట్లు వచ్చేస్తున్నాయ్
X
ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నా.. ఏదో రూపంలో కరోనా వచ్చే ముప్పే ఎక్కువగా ఉంటోంది. ఈ వాదనకు బలం చేకూరేలా పెద్ద ఎత్తున పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ మాయదారి రోగానికి చెక్ పెట్టే వ్యాక్సిన్ ఇంకా రాకపోవటం.. మరో ఆరేడు నెలలకు కానీ వచ్చే అవకాశం లేదన్న మాట ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా స్పష్టం చేస్తోంది. ఇలాంటివేళ.. ఒక మోస్తరు నుంచి మధ్యస్థంగా కోవిడ్ 19తో బాధ పడే రోగులకు దివ్య ఔషధంగా చెప్పే ఫవిపిరవిర్ ఔషధం మరింత ఎక్కువగా అందుబాటులోకి రానుంది.

ఈ మెడిసిన్ ను పరిమిత వినియోగానికి వీలుగా అనుమతులు ఇవ్వటం తెలిసిందే. దీంతో.. ఈ మందును హైదరాబాద్ కు చెందిన ఆప్టిమస్ ఫార్మా ఉత్పత్తి చేస్తోంది. మరో వారంలో మార్కెట్లోకి రానున్న ఈ మందు.. చాలామంది పాజిటివ్ రోగులకు ఉపశమనాన్ని కల్పిస్తుందని చెబుతున్నారు. కొద్దికాలం క్రితం ఈ కంపెనీకి అనుబంధ సంస్థ అయిన ఆప్ట్రిక్స్ ఫార్మా పావిఫిరవిర్ ఏపీఐ తయారీకి అనుమతి పొందింది. తాజాగా ఈ మందును ట్యాబ్లెట్ల ఫార్మాట్ లో తయారీకి ఆప్టిమస్ ఫార్మా సిద్ధమైంది.

ఫావికోవిడ్ 200 అనే బ్రాండ్ తో వీటిని అమ్మనున్నట్లు చెబుతున్నారు. పరిమిత వినియోగం కోసం అనుమతిస్తున్న మెడిసిన్ కావటంతో.. వీటిని కొనుగోలు చేయటానికి ముందు వైద్యుల నుంచి అనుమతి పత్రంతో పాటు.. రోగి ఆంగీకార పత్రం కోసం అవసరమని చెబుతున్నారు. సాధారణంగా ఈ ట్యాబ్లెట్లను పద్నాలుగు రోజలు పాటు వాడాలని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటివరకూ గ్లెన్ మార్క్ ఫార్మాకు చెందిన ఫావిఫ్లూ మందు మాత్రమే మార్కెట్లో అందుబాటులో ఉంది. తొలుత ఈ ట్యాబ్లెట్ ను రూ.103గా అమ్మేవారు. ఇప్పుడు దాన్ని రూ.75కు తగ్గించారు. ఇప్పుడు పోటీగా మరొకరు మార్కెట్లోకి వచ్చేస్తుండటంతో దీని ధరను మరింత తగ్గించే వీలుందని చెబుతున్నారు. ఈ వ్యాపార విషయాలు ఎలా ఉన్నా.. హైదరాబాద్ ఔషదం కోవిడ్ రోగులకు ఉపశమనాన్ని కలిగిస్తే అంతకు మించి ఇంకేం కావాలి?