Begin typing your search above and press return to search.

గ‌ర్భిణి మ‌హిళ‌కు ఆస్ట్రేలియాలో అవ‌మానం

By:  Tupaki Desk   |   30 April 2017 9:42 AM GMT
గ‌ర్భిణి మ‌హిళ‌కు ఆస్ట్రేలియాలో అవ‌మానం
X
భార‌తీయుల‌పై జాతివివ‌క్ష ఇంకా ప‌లు దేశాల్లో కొన‌సాగుతూనే ఉంది. తాజాగా ఆస్ట్రేలియాలో ఓ భారతీయ కుటుంబం జాతి వివక్షకు గురైంది. సిడ్నీలోని లునా పార్కులో బెంచిపై కూర్చునేందుకు మర్యాదపూర్వకంగా సీటు అడిగిన ఉత్సవ్‌ పటేల్‌(33) కుటుంబంపై ఓ ఆస్ట్రేలియా మహిళ జాతి వివక్ష వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. 15 వారాల గర్భవతి అయిన ఉత్సవ్‌ భార్యను ఉద్దేశించి ''మీరంటే అసహ్యం. ఇక్కడ నుంచి వెళ్లిపోండి. ముందు దూరంగా జరగండి'' అంటూ వ్యాఖ్యానించారు. ఈ సంద‌ర్భంగా స‌ద‌రు ఆస్ట్రేలియన్ మ‌హిళ‌ భారత దేశాన్ని ఉద్దేశించి ఆమె విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు.

ఉత్సవ్‌ వెల్లడించిన వివరాల ప్రకారం ఏప్రిల్‌ 22న తన భార్య, నాలుగేళ్ల పాపతో కలసి లునా పార్కుకు ఆయన వెళ్లారు. అక్కడున్న జాయ్‌ రైడింగ్‌పై ఆడించమని పాప మారాం చేయడంతో ఎక్కడైనా కూర్చోమని భార్యకు చెప్పి పాపను తీసుకుని వెళ్లారు. ఇంతలో బెంచిపై కూర్చునేందుకు ఆస్ట్రేలియా మహిళను కాస్త పక్కకు జరగమని ఉత్సవ్‌ భార్య అభ్యర్థించారు. తల పైకెత్తి చూసిన ఆస్ట్రేలియా మహిళ ఉత్సవ్‌ భార్యపై మాటల దాడి ప్రారంభించారు. దూరం నుంచే దీన్ని గమనించిన పటేల్‌ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఆమె దుర్భాషలాడటం ఆపలేదు. దీంతో ఆ ఘటనను ఉత్సవ్‌ తన ఫోన్‌లో చిత్రీకరించాడు. భద్రతా సిబ్బందికి దీన్ని చూపిస్తానని చెప్పినప్పటికీ ఆ ఆస్ట్రేలియా మహిళ ''భద్రతా సభ్యులు ఏం చేస్తారు. నాకు నచ్చింది మాట్లాడుతా. ముందుగా ఇక్కడ నుంచి వెళ్లండి మీరు'' అని వ్యాఖ్యానించారు. ఈ మొత్తం తతంగాన్ని చిత్రీకరించిన వీడియో సహాయంతో ఆస్ట్రేలియా పోలీసులు ప్రస్తుతం ఆమెను విచారిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/