Begin typing your search above and press return to search.

జైట్లీ చుట్టూ ఇండియా టీం..కేజ్రీ పని కాం

By:  Tupaki Desk   |   23 Dec 2015 7:21 AM GMT
జైట్లీ చుట్టూ ఇండియా టీం..కేజ్రీ పని కాం
X
ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ వ్యవహారంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి క్రీడారంగ ప్రముఖుల నుంచి మద్దతు దొరుకుతోంది. టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బుధవారం జైట్లీకి మద్దతు ప్రకటించారు. ఆమ్ ఆద్మీ పార్టీ అరుణ్ జైట్లీపై అవినీతి ఆరోపణలు చేసిన నేపథ్యంలో గంగూలీ స్పందిస్తూ రాజకీయ నాయకుడు ఎన్నికల ద్వారా ప్రజల చేత ఎన్నుకోబడతారనీ, అందుకే వారి అధికారాలను ఎవరూ ప్రశ్నించజాలరని అన్నారు. అరణ్ జైట్లీకి మద్దతుగా నిలిచిన క్రికెటర్లలో గంగూలీ మొదటి వాడు కాదు. ఇప్పటికే అరుణ్ జైట్లీకి వీరేంద్ర సెహ్వాగ్ - గౌతం గంభీర్ - ప్రస్తుత టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీలు మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే.

కాగా ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) నిధుల దుర్వినియోగం వ్యవహారంపై ఇంతకుముందే విచారణ జరిగిందని షూటింగ్ క్రీడాకారుడు - కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ తెలిపారు. ఎటువంటి అక్రమాలు జరగలేదని విచారణలో తేలిందని చెప్పారు. తన ముఖ్యకార్యదర్శిపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సమాధానం చెప్పకుండా అసభ్య పదజాలంతో అరవింద్ కేజ్రీవాల్ ఎదురుదాడి చేస్తున్నారని విమర్శించారు. అవినీతిపరుడైన అధికారిని దగ్గర పెట్టుకుని అవినీతిరహిత పాలన అందిస్తామని కేజ్రీవాల్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

కాగా దేశం మెచ్చిన ప్రముఖ క్రికెటర్లు జైట్లీకి మద్దతిస్తుండడంతో వారిని విమర్శించే ధైర్యం కేజ్రీ చేయలేకపోతున్నారు. జైట్లీని విమర్శించినట్లుగా సెహ్వాగ్ - గంగూలి - కోహ్లీ వంటివారిని విమర్శిస్తే అభిమానులు కేజ్రీపై దండెత్తడం ఖాయం. మొత్తానికి ఈ వ్యవహారంలో కేజ్రీవాల్ ఒంటరయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.