Begin typing your search above and press return to search.

స్విస్ లో ఉన్న‌ది బ్లాక్ మ‌నీ కాదట‌..!!

By:  Tupaki Desk   |   25 July 2018 8:15 AM GMT
స్విస్ లో ఉన్న‌ది బ్లాక్ మ‌నీ కాదట‌..!!
X
వినేవాడు ఉంటే చెప్పేవాడు చెల‌రేగిపోతార‌ని ఊరికే అన‌లేదేమో. నాలుగేళ్ల క్రితం సార్వ‌త్రి ఎన్నిక‌ల ముందు.. స్విస్ బ్యాంకుల్లో వేల కోట్ల న‌ల్ల‌ధ‌నం మూలుగుతోంద‌ని.. దాన్ని వెన‌క్కి ర‌ప్పించేందుకు త‌న‌కు అధికారం ఇవ్వాల‌ని ఆశేష భార‌తావ‌నిని మోడీ కోర‌టం.. ఆయ‌న మాట‌ల్ని న‌మ్మ‌టం తెలిసిందే.

మోడీ అధికారంలోకి వ‌స్తే..బ్యాంకు ఖాతాల్లోకి డ‌బ్బులు వ‌చ్చేస్తాయ‌న్న మాట ప్ర‌తి నోటా వినిపించేది. ఎప్పుడూ త‌మ సొమ్ములు తీసుకునే స‌ర్కారుకు భిన్నంగా త‌మ బ్యాంకు ఖాతాల్లోకి సొమ్ములు వ‌స్తాయ‌న్న మాట స‌రికొత్త‌గా వినిపించింది. దీనికి తోడు స్విస్ బ్యాంకుల్లో దాచి పెట్టిన న‌ల్ల‌ధ‌నాన్ని వెన‌క్కి తెస్తామ‌న్న మాట విన్న‌ప్పుడు.. ప‌వ‌ర్ ఫుల్ మోడీ ఏమైనా చేయ‌గ‌ల స‌త్తా ఉన్నోడుగా ప్ర‌జ‌లు భావించారు.

ఎన్నిక‌ల్లో గెలిచి ప్ర‌ధాన‌మంత్రి సీట్లో కూర్చున్న నాటి నుంచి నేటి వ‌ర‌కూ మ‌ళ్లీ స్విస్ బ్యాంకుల్లో ఉండే న‌ల్ల‌ధ‌నం గురించి.. దాన్ని వెన‌క్కి తీసుకొచ్చే ముచ్చ‌ట‌తో పాటు.. బ్యాంకు ఖాతాల్లో వేస్తాన‌న్న డ‌బ్బు ఊసును ప్ర‌స్తావించ‌ట‌మే మానేశారు మోడీ.

ఈ అసంతృప్తి ఇలా ఉంటే.. తాజాగా స్విస్ బ్యాంకుల్లో ఉండే ధ‌నానికి సంబంధించి స‌రికొత్త వాద‌న‌ను తెర మీద‌కు తీసుకొచ్చారు మోడీ టీమ్ మేట్. 2014 ఎన్నిక‌ల ప్ర‌చారానికి భిన్నంగా మోడీ స‌ర్కారు వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్న విమ‌ర్శ‌తో పాటు.. 2016-17 మ‌ధ్య కాలంలో స్విస్ లో భార‌తీయుల డిపాజిట్లు 50 శాతం పెరిగిన‌ట్లుగా ప్ర‌తిప‌క్షాలు గ‌గ్గోలు పెడుతున్నాయి.

స్విస్ బ్యాంకుల్లో భార‌తీయుల డిపాజిట్లు రూ.7వేల కోట్ల‌కు చేరిన‌ట్లుగా ఆరోపిస్తున్నారు. ఈ విష‌యాన్ని రాజ్య‌స‌భ‌లో ప్ర‌స్తావించిన స‌మ‌యంలో కేంద్ర మంత్రి పియూష్ గోయ‌ల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. స్విస్ బ్యాంకుల్లో ఉన్న భార‌తీయుల ఖాతాల్లో సొమ్ముల్లో న‌ల్ల‌ధ‌న‌మే లేద‌ని చెప్పారు. ఈ విష‌యాన్ని స్విస్ బ్యాంకులు తెలిపిన‌ట్లుగా వ్యాఖ్యానించారు.

స్విస్ అన్ని ఖాతాల్లో బ్లాక్ మ‌నీ లేద‌ని..భార‌త్ లోని స్విస్ బ్రాంచీల్లో లావాదేవీలు.. ఇంట‌ర్ బ్యాంక్ లావాదేవాలు..నాన్ డిపాజిట్ లావాదేవీల‌ను క‌లుపుకొని 50 శాతం డిపాజిట్ అయ్యాయ‌ని.. ఈ స‌మాచారాన్ని కొంద‌రు త‌ప్పుగా అర్థం చేసుకున్నార‌న్నారు.

2014 త‌ర్వాత స్విస్ బ్యాంకులోని భార‌తీయుల న‌ల్ల‌ధ‌నం వివ‌రాల‌కు సంబంధించి 4వేల పేజీల స‌మాచారాన్ని తెప్పించామ‌ని.. దానిపై విచార‌ణ సాగుతుంద‌న్నారు. మంత్రిగారి మాట‌లు చూస్తుంటే.. ఏపీకి ఇవ్వాల్సిన రైల్వేజోన్ మీద మ‌ధ‌నం ఎలా సాగుతుందో.. స్విస్ నుంచి తెప్పించిన పత్రాల మీద అధ్య‌య‌నం కూడా అలానే సాగుతున్న‌ట్లుంది!