Begin typing your search above and press return to search.
సరిహద్దు దాటుతూ భారతీయు కుటుంబం బలి
By: Tupaki Desk | 22 Jan 2022 5:30 AM GMTఅమెరికా-కెనడా సరిహద్దుల్లో విషాదం అలుముకుంది. ఓ భారతీయ కుటుంబం అమెరికాలోకి ప్రవేశిస్తూ మృత్యువాత పడింది. మృతుల్లో పసికందు సహా దంపతులు, ఓ యువకుడు ఉన్నారు. వీరంతా భారత్ లోని గుజరాత్ కు చెందిన వారని అధికారులు తెలిపారు. మైనస్ 30 డిగ్రీల గడ్డకట్టే చలిలో కాలినడకన అమెరికాలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తూ తీవ్రమైన చలికి చనిపోయారని తెలుస్తోంది.
కెనడా నుంచి అమెరికాలోకి అక్రమంగా సరిహద్దులు దాటుతూ అతిశీతల మైనస్ 30 డిగ్రీల వాతావరణానికి నెలల వయసున్న పసికందు సహా ముగ్గురు భారతీయులు మృతి చెందినట్టు శుక్రవారం వెలుగులోకి వచ్చింది.
కెనడాలోని ఎమర్సన్ నగర సమీపంలో అమెరికా-కెనడా సరిహద్దుల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. కెనడా నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన కొందరు భారతీయులను అమెరికా కస్టమ్స్ అధికారులు పట్టుకోవడంతో ఈ విషయం వెలుగుచూసింది. భారతీయులుగా భావిస్తున్న కొందరు వ్యక్తులు గుంపుగా ఏర్పడి కెనడా గుండా అమెరికాలో దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ఈ మేరకు మానవ అక్రమ రవాణా చేసే ముఠాతో వీరు ఒప్పందం చేసుకున్నారు. ఈ మేరకు ముఠా సభ్యులు కెనడాలోని మానిటోబా ప్రావిన్స్ నుంచి వీరిని అమెరికా సరిహద్దు దాటిచేందుకు ప్రణాళిక వేశారు.
మానిటోబా కెనడాలోనే అత్యంత అతిశీతల ప్రాంతం. మైనస్ 30 డిగ్రీల చలి ఉండే ఈ ప్రాంతంలో నాలుగు అడుగుల మేర మంచు పేరుకుపోయి ఉంది. అటువంటి ప్రాంతంలో చిమ్మచీకటిలో గడ్డకట్టిన మంచులో నడుచుకుంటూ భారతీయులు బుధవారం అక్రమంగా అమెరికా సరిహద్దు వద్దకు రాగలిగారు. ఈ క్రమంలోనే చలికి తట్టుకోలేక ఒక కుటుంబానికి చెందిన భార్యాభర్తలు, వారి ఇద్దరు పిల్లలు మృతి చెందారు. మృతుల్లో వారాల వయసున్న పసికందు, ఓ యువకుడు ఉన్నాడు. మృతదేహాలను అక్కడే వదిలి సమూహంలోని మిగతా సభ్యులు అమెరికా సరిహద్దుకు చేరుకున్నారు. వీరిని అమెరికా కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు.
కుటుంబం మరణించిందని సమూహంలోని వారిచ్చిన సమాచారంతో కెనడా భద్రతా సిబ్బందిని అమెరికా అధికారులు అప్రమత్తం చేశారు. వారు వెతకగా నలుగురి మృతదేహాలను గుర్తించి ఇరు దేశాల భారత రాయబార కార్యాలయాలకు సమాచారం ఇచ్చారు.
భారత రాయబార కార్యాలయ అధికారులు మృతదేహాలను భారత్ పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఘటనపై విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందిస్తూ మృదేహాల తరలింపునకు సహకరించాలని అమెరికా-కెనడా అధికారులను కోరారు.
ఇటీవల మెక్సికో, యూకే (బ్రిటన్),కెనడా దేశాల నుంచి అత్యధిక సంఖ్యలో భారతీయులు అక్రమ మార్గంలో అమెరికా వలస వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్టు అమెరికా కస్టమ్స్ అధికారులు తెలిపారు. గత రెండు మూడేళ్లుగా అమెరికాకు అక్రమంగా వలస వస్తున్న వారిలో ఎక్కువమంది భారతీయులే ఉంటున్నారని అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు తెలిపారు.