Begin typing your search above and press return to search.

ఆర్మీనే కాదు పాక్ తాట తీస్తున్న మన హ్యాకర్లు

By:  Tupaki Desk   |   7 Oct 2016 9:43 AM GMT
ఆర్మీనే కాదు పాక్ తాట తీస్తున్న మన హ్యాకర్లు
X
అనుక్షణం తన దుష్టబుద్ధితో భారత్ ను ఇబ్బంది పెడుతున్న పాకిస్థాన్ తీరుపై భారత హ్యాకర్లు మహా గుర్రుగా ఉన్నారు. ఉరీ ఉదంతం నేపథ్యంలో ప్రతీకారం తీర్చుకోవటమే కాదు.. లెక్క సరి చేసేందుకు సైనికులు ఎంత ఉత్సాహాన్ని ప్రదర్శించారో అలాంటి దూకుడునే ప్రదర్శిస్తున్నారు మన హ్యాకర్లు. సర్జికల్ దాడులతో పాకిస్థాన్ కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా షాకిచ్చిన భారత సైన్యానికి ఏ మాత్రం తీసిపోని రీతిలో ఆన్ లైన్ లో వారు చేస్తున్న పనికి పాక్ లోని ప్రభుత్వ సైట్లు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నాయి.

సైన్యం చేపట్టిన సర్జికల్ దాడులకు ఏ మాత్రం తగ్గని రీతిలో.. తాము సైబర్ సర్జికల్ ఎటాక్స్ తో పాక్ తాట తీస్తున్న వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పాకిస్థానీ ప్రభుత్వ వెబ్ సైట్లలోకి ప్రవేశిస్తున్న భారత హ్యాకర్లు వారి కంప్యూటర్లను.. డేటా మొత్తాన్ని లాక్ చేసేస్తున్నారు. దీంతో.. వాటిని ఎలా ఓపెన్ చేయాలో అర్థం కాక తలలు పట్టుకునే పరిస్థితి. భారత హ్యాకర్ల దెబ్బకు షాకుల మీద షాకులు తగులుతున్న పాక్ ప్రభుత్వ వెబ్ సైట్ల నిర్వహకులు..హ్యాకర్లను అన్ లాక్ చేయాలని.. అందుకు భారీ మొత్తాన్ని ఇస్తామని చెప్పటం ఒక విశేషమైతే.. అలాంటి ఆఫర్లకు నో అంటే నో అనేస్తూ తమ దేశభక్తిని ప్రదర్శిస్తున్నారు పలువురు భారత హ్యాకర్లు. పాకిస్థానీ వెబ్ సైట్ల మీద మన హ్యాకర్లు ఇంతలా విరుచుకుపడటానికి కారణం లేకపోలేదు.

భారత సైన్యం సర్జికల్ దాడులు జరిపిన తర్వాత పాక్ హ్యాకర్లు కొందరు.. భారత వెబ్ సైట్లలోకి ప్రవేశించి.. వాటిని హ్యాక్ చేసి.. తమ జాతీయ గీతాల్ని పోస్ట్ చేయటం మొదలుపెట్టారు.దీంతో ఒళ్లు మండిన భారత హ్యాకర్లు మూడో కన్ను తెరిచారు. పాక్ హ్యాకర్లు చేస్తున్న ప్రచారాన్ని తిప్పి కొట్టటమే కాదు.. పాక్ ప్రభుత్వ వెబ్ సైట్లను అసలు పనికి రాకుండా చేస్తున్న వైనం ఇప్పుడు పాక్ కు పెద్ద తలనొప్పిగా మారింది. కొందరు హ్యాకింగ్ నిపుణుల మాటల ప్రకారం.. మన హ్యాకర్లు తలుచుకుంటే.. పాక్ సైబర్ స్పేస్ మొత్తాన్ని ధ్వంసం చేయగల సత్తా మన వాళ్ల సొంతమని చెబుతున్నారు. మరి.. అలాంటిదేదో చేస్తే.. దాయాది దేశాన్ని చావుదెబ్బ తీసినట్లేనేమో..?



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/