Begin typing your search above and press return to search.

అమెరికాలో మరో భారతీయుడిని చంపేశారు

By:  Tupaki Desk   |   29 April 2017 9:23 AM GMT
అమెరికాలో మరో భారతీయుడిని చంపేశారు
X
అమెరికాలో భారతీయుల రక్షణ గాల్లో దీపం లాగే అవుతోంది. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక జడలు విప్పుతున్న జాత్యహంకారంతో స్థానికులు పలువురు భారతీయుల్ని పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో భారతీయుడు అమెరికాలో ప్రాణాలు కోల్పోయాడు. ఐతే ఇది జాత్యహంకారంతో చేసిన హత్యలా కనిపించట్లేదు. ఇండియా నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడిన ఖండు పటేల్ (56) అనే వ్యక్తి ఊహించని రీతిలో ప్రాణాలు కోల్పోయాడు. రెండు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో భాగంగా ఖండుకు అనుకోకుండా తూటా తగిలి చనిపోయినట్లు తెలుస్తోంది.

ఖండు పటేల్ టెనెస్సీ రాష్ట్రంలోని వైట్‌ హెవెన్ లో జాతీయ రహదారి పక్కనే ఉన్న బెస్ట్‌వాల్యూ ఇన్ సూట్స్ మోటల్‌ లో ఎనిమిది నెలలుగా సహాయకుడిగా పనిచేస్తున్నాడు. అతను భార్య.. ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. ఖండు తన విధులు ముగించుకుని.. మోటల్ వెనుక భాగంలో నిలుచుని ఉండగా ఎక్కడి నుంచో వచ్చిన తూటా తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. దూరంగా కొందరు పరస్పరం కాల్పులకు పాల్పడ్డారని.. దాదాపు 30 తూటాలు పేలాయని.. అందులో ఒకటి ఖండు ఛాతీలోకి దిగడంతో అతను ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని స్థానిక వార్తా సంస్థ తెలిపింది. ఖండు కొత్త ఉద్యోగం కోసం మరో ప్రాంతానికి వెళ్లడానికి సన్నాహాలు చేసుకుంటున్న సమయంలోనే ఈ దారుణం చోటు చేసుకుంది. కాల్పులకు పాల్పడిన దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఫిబ్రవరి నుంచి ఇప్పటిదాకా అమెరికాలో జరిగిన వేర్వేరు ఘటనల్లో ఐదుగురు భారతీయులు చనిపోవడం గమనార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/