Begin typing your search above and press return to search.

ప్రతిఒక్కరికి:పెట్రోల్ బంక్ దగ్గర సెల్ మాట్లాడితే..?

By:  Tupaki Desk   |   22 Aug 2015 4:33 AM GMT


పెట్రోల్ బంక్ ల దగ్గర సెల్ ఫోన్ వినియోగించొద్దని హెచ్చరికలు చేయటం కనిపిస్తుంటుంది. అవసరానికి మించిన జాగ్రత్త అని కొట్టిపారేసే వాళ్లు చాలామందే ఉంటారు. సెల్ ఫొన్ రేడియేషన్ కారణంగా మంటలు చెలరేగే ప్రమాదం పొంచి ఉంటుందని.. ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ ఫోన్ మాట్లాడొద్దని.. అవసరమైతే సెల్ స్విచ్ఛాప్ చేయాలని చెబుతుంటారు.
కానీ.. వీటిని ఎవరూ పెద్దగా సీరియస్ గా తీసుకున్నట్లు కనిపించదు. కానీ.. శుక్రవారం హైదరాబాద్ లోని ఒక పెట్రోల్ బంక్ దగ్గర చోటు చేసుకున్న ప్రమాదానికి సంబంధించి.. సదరు పెట్రోల్ బంక్ సీసీ కెమేరాల్లో నమోదైన ఫుటేజ్ ని మీడియాకు అందించారు.

ఒక పెట్రోల్ బంక్ వద్ద టూవీలర్ మీద వచ్చిన ఒక వ్యక్తి పెట్రోల్ పోయించుకునే సమయంలో సెల్ ఫోన్ మోగటం.. దాన్ని లిఫ్ట్ చేసినంతనే సెకన్ల వ్యవధిలో ఒక్కసారి మంటలు చెలరేగటం.. దాంతో పెట్రోల్ పోసే వ్యక్తి పారిపోవటం.. వెను వెంటనే తేరుకున్న అక్కడి సిబ్బంది పుణ్యమా అని పెను ప్రమాదం తప్పిన వైనం కనిపిస్తుంది.

తాజా ఉదంతం చూస్తే.. హెచ్చరికలు ఊరికే చేయరని.. ప్రమాదం గురించి పక్కాగా అవగాహన ఉన్న పరిస్థితులను పరిగణలోకి తీసుకొనే చేస్తుంటారని అనిపించక మానదు. తాజా ఘటన నేపథ్యంలో పెట్రోలో పోయించుకునే సమయంలో.. వినియోగదారులు ఎవరూ సెల్ ఫోన్ మాట్లాడకుండా ఉండాలని పేర్కొంటూ హైదరాబాద్ పోలీసులు ఈ ఉదంతానికి సంబంధించిన వీడియోను విడుదల చేస్తున్నారు. సో.. పెట్రోల్ బంక్ ల దగ్గర సెల్ ఫోన్ తో చాలా జాగ్రత్తగా ఉండటం చాలా.. చాలా అవసరమన్నవిషయం మర్చిపోకూడదు.