Begin typing your search above and press return to search.

మ‌న ఎన్నారైలు సృష్టించిన ప్ర‌త్యేక రికార్డ్ ఇది

By:  Tupaki Desk   |   24 April 2018 6:00 AM GMT
మ‌న ఎన్నారైలు సృష్టించిన ప్ర‌త్యేక రికార్డ్ ఇది
X
భార‌తీయ ఎన్నారైలో మ‌రో రికార్డు సృష్టించారు. విదేశాల నుంచి స్వదేశానికి నిధులు పంపిస్తున్నవారిలో భారతీయులే అధికంగా ఉన్నారు. వివిధ దేశాల్లో స్థిరపడ్డ భారతీయులు గతేడాది పంపించిన సొమ్ము దాదాపు 69 బిలియన్ డాలర్లు (రూ.4,48,500 కోట్లు)గా ఉన్నది. ఈ మేరకు ప్రపంచ బ్యాంక్ తెలియజేసింది. 2016లో 62.7 బిలియన్ డాలర్లు రాగా, 2015తో పోల్చితే ఇది 8.9 శాతం తక్కువే. అయితే 2017లో మళ్లీ 9.9 శాతం పెరిగిన నిధులు.. 2014లో మాత్రం 70.4 బిలియన్ డాలర్లుగా నమోదైనట్లు ప్రపంచ బ్యాంక్ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. భారత్ తర్వాత రెండో స్థానంలో చైనా (64 బిలియన్ డాలర్లు) ఉండగా, తర్వాతి స్థానాల్లో వరుసగా ఫిలిప్పీన్స్ (33 బిలియన్ డాలర్లు), మెక్సికో (31 బిలియన్ డాలర్లు), నైజీరియా (22 బిలియన్ డాలర్లు), ఈజిప్టు (20 బిలియన్ డాలర్లు), పాకిస్తాన్ (20 బిలియన్ డాలర్లు), బంగ్లాదేశ్ (13 బిలియన్ డాలర్లు) ఉన్నాయి.

ఇదిలావుంటే గ‌త ఏడాది అల్పాదాయ - మధ్యస్త ఆదాయ దేశాల్లోకి ఆయా దేశస్తులు పంపిన సొమ్ము మొత్తం 466 బిలియన్ డాలర్లుగా ఉందని, అంతకుముందు ఏ డాది ఇది 429 బిలియన్ డాలర్లకే పరిమితమైందని ప్రపంచ బ్యాంక్ వివరించింది. ఇక ధనిక దేశాల్లోకి కూడా క్రిందటేడాది 7 శాతం నిధుల రాక పెరుగడం గమనార్హం. 2016తో పోల్చి తే 573 బిలియన్ డాలర్ల నుంచి 613 బిలియన్ డాలర్లకు చేరాయి. ఐరోపా, రష్యా, అమెరికాల్లో బలమైన వృద్ధిరేటు కనిపించింది. కాగా, అధిక ముడి చమురు ధరలు, యూరోతోపాటు రష్యా కరెన్సీ రూబుల్ విలువ పెరుగడం వల్లే స్వదేశాలకు నిధుల వరద పారిందని ప్రపంచ బ్యాంక్ విశ్లేషించింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా ఇదే తరహాలో ఆయా దేశాలకు ప్రవాసీయుల నుంచి నిధులు పోటెత్తగలవన్న అంచనాను వెలిబుచ్చింది. ఈ నిధులు స్వ‌దేశంలో అభివృద్ధికి దోహ‌ద‌ప‌డుతుంద‌ని విశ్లేషించింది.