Begin typing your search above and press return to search.

అగ్రరాజ్యంలో రియల్ హీరో మనోడు.. ఇంతకూ ఏం చేశాడంటే?

By:  Tupaki Desk   |   4 Jun 2020 4:15 AM GMT
అగ్రరాజ్యంలో రియల్ హీరో మనోడు.. ఇంతకూ ఏం చేశాడంటే?
X
ఆపద మీద పడినప్పుడు వణికిపోయే వారు కొందరుంటే.. మరికొందరు దాన్నో అవకాశంగా మలుచుకునేవారు ఉంటారు. అదే రీతిలో తోటివారు చిక్కుల్లో పడుతున్న వేళ.. తమకేమీ పట్టనట్లుగా వదిలేయటం ఒక పద్దతి. అందుకు భిన్నంగా.. వారెవరో తెలీనప్పటికీ వారికి ఆశ్రయం ఇచ్చే పెద్ద మనసు చాలా తక్కువమందిలో ఉంటుంది. ఆ కోవకే చెందుతాడు అమెరికాలో స్థిరపడిన మనోడు రాహుల్ దూబే. ఇప్పుడతను చేసిన పనికి స్థానిక మీడియా ఆయన్ను హీరోగా పొగుడుతోంది. ఆయన చేసిన సాయం గురించి తెలిసిన వారంతా ఆయన్ను పెద్ద ఎత్తున అభినందిస్తున్నారు. ఇంతకీ మనోడు చేసిన సాయం ఏమిటి? అన్న విషయంలోకి వెళితే..

నల్లజాతీయుడు ఒకడ్ని పోలీసు అధికారి ఒకరు అత్యంత దుర్మార్గం.. కర్కశంగా వ్యవహరించటం.. ఆ క్రమంలో ఆ వ్యక్తి ప్రాణాలు పోగొట్టుకోవటం తెలిసిందే. దీనిపై మండిపడిన అమెరికన్ సమాజం.. రోడ్ల మీదకు వచ్చి పెద్ద ఎత్తున నిరసనలు.. ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇలాంటివేళ.. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో నివసిస్తున్న భారత మూలాలున్న వ్యాపారవేత్త రాహుల్ దూబే.. కొందరు అపరిచితుల్ని తన ఇంట్లో ఆశ్రయమిచ్చి కాపాడాడు. ఆందోళనలునిర్వహిస్తున్న ఒక గ్రూపును పోలీసులు సమీపిస్తుంటే.. వారందరిని తన ఇంట్లోకి రావాల్సిందిగా రాహుల్ కోరారు.

గడిచిన పదిహేడేళ్లుగా రాహుల్ వాషింగ్టన్ లోనే ఉంటున్నారు. ట్రేడింగ్ కంపెనీ నిర్వహిస్తున్న అతడు..తన ఇంట్లోకి వచ్చిన 75 మంది అపరిచితులకు బస సౌకర్యంతో పాటు.. వారికి అవసరమైన ఆహారాన్ని అందించారు. రాత్రంతా తన ఇంట్లోనే ఉంచి పోలీసుల బారి నుంచి వారిని కాపాడినట్లుగా మీడియా చెబుతోంది. 75 మంది అపరిచితులు వారింట్లో రాత్రంతా ఉన్నారని.. వారిలో తల్లీబిడ్డలతో కూడిన కుటుంబం కూడా ఉన్నట్లు మీడియా కథనాలు వెల్లడించాయి.

తన కొడుకు గదిలోనూ కొందరు విశ్రాంతి తీసుకున్నట్లు రాహుల్ పేర్కొన్నారు. తాను ఆశ్రయం ఇచ్చిన వైనంపై మీడియా పెద్ద ఎత్తున అభినందనలు తెలుపుతుంటే.. రాహుల్ మాత్రం అంత గొప్పపని తానేమీ చేయలేదని స్పష్టం చేస్తున్నారు. రాత్రివేళలో కొందరు తమ ఇంటి వైపు పరిగెత్తుకుంటూ వెళుతున్నారని.. వచ్చిన వారిని వచ్చినట్లుగా తమ ఇంట్లోకి రమ్మని చెప్పామంటున్నారు. సమస్యలో చిక్కుకున్న వారిని వదిలేయకుండా.. ఇంట్లోకి తీసుకెళ్లి ఆశ్రయం ఇవ్వటమే కాదు.. అతిధ్యమిచ్చిన తీరుతో రాహుల్ ఇప్పుడు అందరి మనసుల్ని దోచుకున్నారని చెప్పాలి.