Begin typing your search above and press return to search.

ట్రంప్ ప‌రువు తీసేసిన భార‌తీయ దోస్తు

By:  Tupaki Desk   |   28 Aug 2019 6:37 AM GMT
ట్రంప్ ప‌రువు తీసేసిన భార‌తీయ దోస్తు
X
కొందిరికి ఓ ర‌క‌మైన థ్రిల్ ఉంటుంది. అది చేసే వాళ్ల‌కు ఎంతో చిత్రంగా క‌నిపిస్తుంది. తాజాగా అదే జ‌రిగింది. అగ్ర‌రాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తో గతంలో వ్యాపార భాగస్వామిగా ఉన్న ఓ భారత సంతతి వ్యక్తి దొంగతనం చేసి దొరికిపోయాడు. అమెరికాలోని మెంఫిస్ ఇంటర్నేషనల్‌‌‌‌ ఎయిర్‌‌‌‌ పోర్టులో పాసింజర్ల లగేజీలను దొంగిలిస్తూ సీసీ కెమెరాలకు చిక్కారు. దొంగిలించిన సూట్‌‌‌‌ కేసు తన కార్లో పెట్టుకుని మరో ఫ్లయిట్‌‌‌‌ ఎక్కుతుండగా చావ్లాను పట్టుకున్నట్టు పోలీసులు చెప్పారు. థ్రిల్‌ కోసం చేసిన ఈ దొంగతనం సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడంతో పోలీసులకు చిక్కాడు.

ఆగస్టు 18న మెంఫిస్‌ అంతర్జాతీయ విమానాశ్రయ బ్యాగేజ్‌ కౌంటర్‌ నుంచి ఇతర ప్రయాణికుల సూట్‌ కేస్‌ ను తన కారులో దాచిపెట్టి...తర్వాత వచ్చి విమానం ఎక్కి వెళ్లిపోయారు. బాధితుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన ఫుటేజ్‌ లను పరిశీలించగా విషయం బయటపడింది. దినేశ్‌ మెంఫిస్‌ ఎయిర్‌ పోర్టుకు తిరిగొచ్చిన వెంటనే పోలీసులు అరెస్టు చేశారు. ‘చోరీలు చేయడం తప్పని తెలుసు. థ్రిల్‌ కోసమే ఈ పనిచేశా’ అని దినేశ్‌ చెప్పడంతో పోలీసులు విస్తూపోయారు. చావ్లా కారును తనిఖీ చేసిన పోలీసులు అందులో ఓ సూట్‌‌‌‌ కేస్‌‌‌‌ తో పాటు నెల రోజుల కిందట ఎయిర్‌‌‌‌ పోర్ట్‌‌‌‌ లో కొట్టేసిన మరో లగేజ్‌‌‌‌ ను కూడా గుర్తించినట్టు న్యూయార్క్‌‌‌‌ టైమ్స్‌‌‌‌ పేపర్‌‌‌‌ ఓ వార్తను పబ్లిష్‌‌‌‌ చేసింది. రెండు బ్యాగుల్ని దొంగిలించినట్టు చావ్లా అంగీకరించారని పోలీసులు చెప్పారు. ఆయన చోరీచేసిన వస్తువుల విలువ నాలుగు వేల డాలర్లు ఉంటుందని గుర్తించారు. ఎంతోకాలంగా తాను ఇలాంటి దొంగతనాలు చేస్తున్నానని చావ్లా ఒప్పుకున్నట్టు పోలీసులు చెప్పారు. ఇంతకుముందు చేసిన దొంగతనాల వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. ఐదువేల డాలర్ల పూచీకత్తుపై కోర్టు దినేశ్‌కు బెయిల్‌ మంజూరు చేసింది.

చావ్లా హోటల్స్‌‌‌‌ కు దినేశ్‌‌‌‌ చావ్లా సీఈవోగా ఉన్నారు. ఇంతకుముందు డొనాల్డ్‌‌‌‌ ట్రంప్‌‌‌‌ కు ఆయన బిజినెస్‌‌‌‌ పార్టనర్‌‌‌‌ గా ఉండేవారు. దినేశ్‌‌‌‌ చావ్లా ఆయన తమ్ముడు సురేశ్‌‌‌‌ చావ్లా అమెరికాలోని డెల్టాలో హోటల్స్‌‌‌‌ - మోటల్స్‌‌‌‌ నడుపుతున్నారు. క్లెవెల్యాండ్‌‌‌‌ లో లగ్జరీ హోటల్‌‌‌‌ కడుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ట్రంప్‌‌‌‌ ఆర్గనైజేషన్‌‌‌‌ తో కలిసి దినేశ్‌‌‌‌ చావ్లా జాయింట్‌‌‌‌ వెంచర్‌‌‌‌ గా ఈ ప్రాజెక్టులు చేపట్టారు.