Begin typing your search above and press return to search.

పవర్లో ఎవరున్నా.. వైట్ హౌస్ లో మనోళ్లు ఉండాల్సిందే

By:  Tupaki Desk   |   6 March 2021 5:30 AM GMT
పవర్లో ఎవరున్నా.. వైట్ హౌస్ లో మనోళ్లు ఉండాల్సిందే
X
ప్రపంచానికి పెద్దన్న అమెరికా. ఆ ఆగ్రరాజ్యానికి ఉండే పవర్ అంతా అక్కడి వైట్ హౌస్ కేంద్రంగానే నడుస్తుంది. అలాంటి పవర్ పాయింట్ లో భారత మూలాలు ఉన్న అమెరికన్లకు లభిస్తున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. అమెరికా అధ్యక్షుడి ఎవరున్నా సరే.. వైట్ హౌస్ లోని పలు విభాగాల్లో మనోళ్లు కీలక బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. ఇటీవల బైడెన్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత భారత మూలాలు ఉన్న వారి సంఖ్య మరింత పెరిగింది.

గతంలో ఎప్పుడూ లేని రీతిలో వైట్ హౌస్ లో ఈ సారి 55 మంది భారతీయ అమెరికన్లకు అవకాశం లభించింది. భారత మూలాలు ఉన్న కమలాహ్యారీస్ ఏకంగా అమెరికా ఉపాధ్యక్ష పదవిని చేపట్టటంతో మనోళ్లు హవా మరింత పెరిగింది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. గడిచిన కొద్దికాలంగా వైట్ హౌస్ లో అధ్యక్షుడి స్థానంలో ఎవరున్నా.. భారత మూలాలు ఉన్న వారికి ప్రాధాన్యత లభించక తప్పట్లేదు. 2009-17 మధ్య అమెరికా అధ్యక్షుడిగా వ్యవహరించిన ఒబామా కాలంలోనూ భారతీయులు.. భారత మూలాలు ఉన్న వారికి పెద్ద ఎత్తున అవకాశాలు లభించాయి.

ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ట్రంప్ సైతం భారతీయులు.. భారత మూలాలు ఉన్న వారికి అవకాశాలు ఇచ్చారు. కాకుంటే.. వారి సంఖ్య తగ్గిందని చెప్పాలి. ట్రంప్ సర్కారులో 36 మంది భారతీయులు.. భారత మూలాలు ఉన్న వారికి వైట్ హౌస్ లో అవకాశాలులభించటం గమనార్హం. భారతీయ మహిళ నిక్కీ హ్యాలీకి ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో అమెరికా తరఫున అవకాశం వచ్చింది.భారతీయులకు కేబినెట్ర్యాంకు కల్పించిన తొలి అధ్యక్షుడు ట్రంప్ కావటం గమనార్హం.

బైడన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తన టీంలోకి పెద్ద ఎత్తున మనోళ్లనే తీసుకుంటున్నారు. డాక్టర్ వివేక్ మూర్తిని అమెరికా సర్జన్ జనరల్ గా నియమించటం.. న్యాయవాది వనితామూర్తి అసోసియేట్ అటార్నీ జనరల్ గా ఖారారు కావటం తెలిసిందే. వైట్ హౌస్ తో పాటు.. నాసాలోనూ భారత సంతతికి అవకాశాలు పెద్ద ఎత్తున లభిస్తున్నాయి. నాసాలోని పలు విభాగాల్లో మనోళ్లు కీలక స్థానాల్లో ఉన్నారు.మార్స్ మిషన్ లో గైడెన్స్.. నావిగేషన్.. కంట్రోల్ ఆపరేషన్లకు నాయకత్వం వహించారు. ఇలా అమెరికాలోని పలు విభాగాల్లో మనోళ్లు అదరగొట్టేస్తున్నారని చెప్పక తప్పదు.