Begin typing your search above and press return to search.

మ‌న పాస్‌ పోర్ట్ ఆఫ్రికా దేశాల కంటే చీప్‌

By:  Tupaki Desk   |   25 Oct 2017 11:30 PM GMT
మ‌న పాస్‌ పోర్ట్ ఆఫ్రికా దేశాల కంటే చీప్‌
X
అభివృద్ధి చెందుతున్న దేశాల‌తో స‌మానంగా ఎదుగుతున్నామ‌ని.....ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని ముఖ్య‌ దేశాల్లో మన భార‌తీయులు ఉన్నార‌ని మ‌నం సంతోష‌ప‌డుతున్న‌ప్ప‌టికీ...మ‌న‌కు ఓ దుర్వార్త వినిపించింది. అదే ప్రపంచంలో మన పాస్‌ పోర్ట్‌ కు ఉన్న విలువ మాత్రం చాలా తక్కువ అనే విష‌యం. పాస్‌ పోర్ట్ ఇండెక్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. చిత్రంగా అస్స‌లు అభివృద్ధి చెంద‌ని దేశాల పాస్‌ పోర్ట్‌ లు కూడా మ‌న‌కంటే ఎక్కువ విలువ క‌లిగి ఉండ‌టం గ‌మ‌నార్హం.

గ్లోబల్ ఫైనాన్సియల్ అడ్వైజరీ సంస్థ ఆర్టన్ కాపిటల్ ఈ పాస్‌ పోర్ట్ ఇండెక్స్‌ ను తయారు చేసింది. ప్రపంచంలో వీసా లేకుండా లేదా వీసా ఆన్ అరైవల్ కింద కేవలం ఆ దేశ పాస్‌ పోర్ట్‌ తో ఎన్ని దేశాలకు వెళ్లగలరు అన్నదానిని బట్టి పాస్‌ పోర్ట్ విలువను లెక్కగట్టారు. ఐక్యరాజ్య సమితిలోని మొత్తం 193 సభ్య దేశాల పాస్‌ పోర్ట్‌ ల విలువను లెక్కగట్టారు. ఇందులో సింగపూర్ తొలి స్థానంలో నిలిచింది. ఒక ఆసియా దేశం తొలి స్థానంలో నిలవడం ఇదే తొలిసారి. ప్రపంచంలోని పవర్‌ఫుల్ పాస్‌ పోర్ట్‌ లలో మనది 75వ స్థానంలో ఉంది. ఈ విషయంలో ఆఫ్రికా దేశాలు జింబాబ్వే (65) - ఉగాండా (66) - మడగాస్కర్ (74) - రువాండా (72) - సియరె లియోన్ (67) కంటే కూడా మన పాస్‌ పోర్ట్ విలువ చాలా తక్కువగా ఉండటం గమనార్హం.

మ‌రోవైపు ఇండియన్ పాస్‌ పోర్ట్ ఉన్న వారు కేవలం 51 దేశాలకు మాత్రమే వీసా లేకుండా వెళ్లే అవకాశం ఉంది. ఈ విషయంలో మన పొరుగు దేశాలు భూటాన్ (76) - నేపాల్ (89) - శ్రీలంక (89) - బంగ్లాదేశ్ (90) - పాకిస్థాన్ (93) కంటే కాస్త మెరుగ్గా ఉండటమే భారత్‌ కు ఊరటనిచ్చే విషయం. 94వ స్థానంతో ఆఫ్ఘనిస్థాన్ అట్టడుగున నిలిచింది. ఇక సింగపూర్ పాస్‌పోర్ట్ కలిగి ఉన్నవాళ్లు 159 దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చని ఈ సర్వే తేలింది. జర్మనీ రెండోస్థానంలో, స్వీడన్ - సౌత్ కొరియా మూడో స్థానంలో ఉన్నాయి. నాలుగోస్థానంలో జపాన్ - మరో ఆరు యురోపియన్ దేశాలతో కలిసి బ్రిటన్ ఉంది. అమెరికా ఆరోస్థానానికి పడిపోయింది. ఈ మధ్యే టర్కీ - సెంట్రల ఆఫ్రికన్ రిపబ్లిక దేశాలు అమెరికాకు ఉన్న వీసా ఫ్రీ స్టేటస్‌ ను ఎత్తేయడంతో అమెరికా స్థానం పడిపోయింది.