Begin typing your search above and press return to search.

రైల్వే టిక్కెట్ కావాలంటే రూ.5 ఇవ్వాలా?

By:  Tupaki Desk   |   7 Feb 2016 10:30 PM GMT
రైల్వే టిక్కెట్ కావాలంటే రూ.5 ఇవ్వాలా?
X
ఏ చిన్న అవకాశం వచ్చిన గూబ గుయ్యిమనేలా వ్యవహరిస్తున్న రైల్వేశాఖ తాజాగా మరో పథకాన్ని తెర పైకి తీసుకొచ్చింది. పైకి ఏదో మంచిపని చేస్తున్నా.. అదంతా కాసుల కోసం దొడ్డిదారి ప్రయత్నమన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. రిజర్వేషన్ల మొదలు.. ప్రతి విషయంలోనూ ఏదో ఒక మతలబుతో భారీగా వడ్డింపులు వడ్డిస్తున్న భారతీయరైల్వేలు తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు.

తాజా నిర్ణయం ప్రకారం.. రైల్వే టిక్కెట్లను పేపరు మీద కాకుండా.. ఫోన్ ఎస్ ఎంఎస్ ల ద్వారా సరి చూసుకోవటం తెలిసిందే. ఇప్పుడీ విధానాన్నిస్టేషన్లలో ఇష్యూ చేసే జనరల్ టిక్కెట్ల విషయంలోనూ అమలు చేయాలని నిర్ణయించారు. తాజా నిర్ణయం ప్రకారం.. ఎవరైనా కానీ పేపరు టిక్కెట్టు కావాలని పట్టుబడితే వారు టిక్కెట్టు ధరకు రూ.5 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇదంతా ఎందుకంటే పర్యావరణ పరిరక్షణ అని.. పేపరు వినియోగాన్ని తగ్గించటం.. తద్వారా చెట్ల నరికివేతను అడ్డుకునే వీలు ఉంటుందన్న మాటను చెబుతోంది.

పైకి ఈ మాట చెబుతున్నా.. లోపల వ్యవహారం వేరన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. రైల్వే ప్రయాణించేది యూత్ మాత్రమే కాదని.. మధ్య వయస్కులు.. పెద్దవారు ఉంటారని మర్చిపోకూడదు. అంతేకాదు.. నగరజీవులు మాత్రమే కాకుండా గ్రామీణ.. పట్టణ ప్రాంతాల వారు ఉంటారని.. అక్షరాస్యులతో పాటు నిరక్షరాస్యులు ఉంటారని మర్చిపోకూడదు. ఇలా ఎన్నో రకాలైన ఉన్న దేశంలో.. ప్రింట్ టిక్కెట్టు అంటేనే గురి అన్నోళ్లు చాలామందే ఉంటారు. సెల్ ఫోన్ లో మెసేజ్ ల పెట్టెను చూసుకోవటానికి చాలామంది ఇష్టపడరు.

ఇక.. గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారి భయాలు చాలానే ఉంటాయి. ఇలాంటి వారంతా తాజా విధానంలో ఇబ్బంది పడటమే కాదు.. వారిపై అదనపు భారం పడే వీలుంది. భారతదేశం లాంటి వైరుధ్యాలున్న దేశంలో ఇలాంటి ప్రయోగాన్ని చేప్టటాలంటే ప్రయోగాత్మకంగా చేపట్టాలి. అంతే కానీ.. దానికి డబ్బుతో లింకెట్టకూడదన్న విషయం మర్చిపోకూడదు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే చాలామంది ఫోన్లో వచ్చే మేసేజ్ కన్నా రూ.5 అదనంగా ఇచ్చే వీలుంది. అదే జరిగితే రైల్వేలకు కాసుల పంట.. సామాన్యులకు జేబులకు కంత అని చెప్పక తప్పదు.