Begin typing your search above and press return to search.

రైలింజ‌న్ మాయ‌మైంది

By:  Tupaki Desk   |   19 July 2016 7:51 AM GMT
రైలింజ‌న్ మాయ‌మైంది
X
భార‌తీయ రైల్వేల్లో విచిత్ర‌మైన సంఘ‌ట‌న జ‌రిగింది. ఒక రైలింజన్‌ మాయమైంది. దీంతో రైల్వే అధికారులు ఈ రైలింజన్‌ కోసం దేశమంతా వెతుకుతున్నారు. రైలు డ్రైవ‌ర్లంద‌రినీ ఇదే ప‌నికి నియ‌మించారు. దాదాపుగా నెల‌రోజులుగా క‌నిపించ‌కుండా పోయిన ఈ రైలింజ‌న్ ఎక్క‌డ ఉందో అని అంతా వెతుకుతున్నారు.

23384 నెంబర్‌ కలిగిన విద్యుత్‌ రైలింజన్‌ ఒకటి సర్వీసింగ్‌ కోసం గత నెల 15న తుగ్లకాబాద్‌ లోని రిపేరింగ్‌ షెడ్‌ కు రావాల్సి ఉంది. రావాల్సిన తేదీ నాటికి అది రాక‌పోవ‌డంతో దేశంలో ఎక్కడో విధి నిర్వహణలో ఉందని అధికారులు భావించారు. కానీ, నెల దాటిన తరువాత కూడా రైలింజన్‌ జాడ తెలియ‌లేదు. దీంతో వారు రైల్వే బోర్డు అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకుని వెళ్లారు. ఎక్క‌డుందా అని ఆరా తీస్తే ఎవ‌రి వ‌ద్దా స‌మాధానం లేదు. దీంతో రైలింజన్‌ ఎక్కడ ఉందో వెదకడానికి 60 వేల మంది లోకో పైలెట్లను - అసిస్టెంట్‌ లోకోపైలెట్లను రంగంలోకి దింపారు. దేశంలోని అన్ని రైలు మార్గాల్లో - ప్ర‌ధాన జంక్ష‌న్ల‌లో - స్టేష‌న్ల‌లో ఉన్న అన్ని ఇంజిన్ల‌ను ప‌రిశీలిస్తున్నార‌ట‌. ఎక్కడ ఇంజిన్ ఖాళీగా క‌నిపించినా అది ఇదేనేమో అని చూస్తున్నార‌ట‌.

కాగా గ‌తంలోనూ ఇలాంటి సంఘ‌ట‌న జ‌రిగింది. అప్పుడు ఆ ఇంజిన్ ను వెతికిప‌ట్టుకోవ‌డానికి నాలుగు నెల‌లు ప‌ట్టింది. 2012 ఏప్రిల్ లో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వ‌రంగ‌ల్ జిల్లా ఖాజీపేట జంక్ష‌న్ నుంచి రైలింజ‌న్ త‌ప్పిపోయింది. దాంతో ఒక్క‌సారిగా క‌ల‌క‌లం రేగింది. ఇప్ప‌టి మాదిరిగానే దానికోసం దేశ‌మంతా వెతికారు. నెల‌లు త‌ర‌బ‌డి వెతికినా అది దొర‌క్క‌పోవ‌డంతో అధికారులు ఏం జ‌రిగిందో తెలియ‌క ఒకటే టెన్ష‌న్ ప‌డ్డారు. చివ‌ర‌కు నాలుగు నెల‌ల త‌రువాత ఖాజీపేట‌కు స‌మీపంలోనే అది దొరికింది. వాడ‌కుండా వ‌దిలేసిన ఒక రైలు ట్రాక్ పై క‌నిపించింది. ఆ ట్రాక్ కు ప్ర‌ధాన ట్రాక్ ల‌కు మ‌ధ్య గుట్ట ఉండ‌డంతో అది అక్క‌డున్న‌ట్లు ఎవ‌రూ గుర్తించ‌లేదు. చివ‌ర‌కు ఎలాగోలా దాని జాడ తెలుసుకున్నారు. అయితే.. ఇంత‌కూ అది అక్క‌డ‌కు ఎలా వెళ్లింద‌న్న‌ది విచార‌ణ జ‌రిపితే షాకింగ్ న్యూస్ తెలిసింది. బాగా తాగిన మ‌త్తులో ఉన్న ఓ డ్రైవ‌రే దాన్ని అక్క‌డ‌కు తీసుకెళ్లి వ‌దిలేసిన‌ట్లు తేలింది. ఇప్పుడు కూడా అలాంటి కార‌ణాల వ‌ల్లే మిస్స‌యిన‌ట్లు భావిస్తున్నారు. దీంతో ఖాళీగా ఉన్న ప‌ట్టాల‌న్నీ కూడా వెతుకున్నారు.