Begin typing your search above and press return to search.

మరింత పతనం దిశగా రూపాయి!

By:  Tupaki Desk   |   20 Oct 2022 5:30 PM GMT
మరింత పతనం దిశగా రూపాయి!
X
అమెరికన్‌ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి పతనం కొనసాగుతోంది. అక్టోబరు 19న బుధవారం అమెరికన్‌ డాలర్‌తో పోలిస్తే తొలిసారి రూ.83 స్థాయికి పతనమైన రూపాయి 83.21 రూపాయిల వద్ద అక్టోబర్‌ 20 గురువారం మరో ఆల్‌టైమ్‌ పతనం నమోదు చేసింది. ఈ సంవత్సరం రూపాయి ఇప్పటివరకు దాదాపు 12 శాతం పడిపోవడం గమనార్హం.

ఓవైపు కరోనా అనంతర పరిస్థితులు, ఆర్థిక మాంద్యం, ఉక్రెయిన్‌ - రష్యా యుద్ధ ప్రభావాలు, పెరుగుతున్న చమురు దిగుమతులు, వాణిజ్య లోటు పెరుగుతుండటం, అమెరికా ఫెడ్‌ బ్యాంకు వడ్డీ రేట్లను పెంచడం వంటి కారణాలతో రూపాయి పతనం కొనసాగుతోంది.

మరోవైపు విదేశీ ఇన్వెస్టర్లు ఈ ఏడాది ఇప్పటివరకు భారతీయ ఈక్విటీల నుండి 23.4 బిలియన్‌ డాలర్లు, డెట్‌ మార్కెట్‌ నుంచి 1.4 బిలియన్‌ డాలర్లు పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. దీంతో రూపాయిపై విశ్వాసం ఇన్వెస్టర్లలో సన్నగిల్లడం కూడా రూపాయి పతనానికి కారణమని నిపుణులు చెబుతున్నారు.

కాగా దేశీయ వాణిజ్య లోటు, ద్రవ్యోల్బణం, పెరుగుతున్న అమెరికా ఫెడ్‌ వడ్డీరేట్లు కారణంగా అమెరికా డాలరు మారకంలో రూపాయి ఈ ఏడాది గత తొమ్మిదేళ్లలో లేనంత కనిష్టానికి పడిపోతుందని రాయిటర్స్‌ పోల్స్‌ తాజాగా బాంబుపేల్చింది. 14 మంది బ్యాంకర్లు, విదేశీ మారకద్రవ్య సలహాదారుల పోల్‌ అంచనాల ప్రకారం.. 2022 డిసెంబర్‌ నాటికి అమెరికన్‌ డాలర్‌తో పోల్చితే మన రూపాయి 84.50కి మరింత పడిపోయే ప్రమాదం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి.

అంతేకాకుండా ఈ సంవత్సరం రూపాయి కోలుకోదనే ఏకాభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తుండటం గమనార్హం. మరోవైపు యూఎస్‌ ఫెడ్‌ వడ్డింపుతో డాలరు ఇండెక్స్‌ 18 శాతం జంప్‌ చేయడం గమనార్హం.

రాబోయే రోజుల్లో రూపాయి మరింత బలహీనత పడి అతి త్వరలోనే 84 స్థాయిని తాకనుందని మెహతా ఈక్విటీస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కమోడిటీస్‌ రాహుల్‌ కలంత్రి తాజాగా తెలిపారు. డిసెంబరు నాటికి రూపాయి డాలర్‌తో పోలిస్తే 85 స్థాయికి పతనం కావచ్చని ఆయన చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.