Begin typing your search above and press return to search.

రూపాయి మ‌రింత ప‌త‌నం.. ద్ర‌వ్యోల్బ‌ణం సెగ‌త‌ప్ప‌దా?

By:  Tupaki Desk   |   26 Sep 2022 2:04 PM GMT
రూపాయి మ‌రింత ప‌త‌నం.. ద్ర‌వ్యోల్బ‌ణం సెగ‌త‌ప్ప‌దా?
X
డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పతనం ఇంకా కొనసాగుతూనే ఉంది. అమెరికా రేట్ల పెంపుతో ఊపందుకున్న పతనం ఈక్విటీ మార్కెట్లలోని బలహీనతలతో కొనసాగుతోంది. సోమవారం రూ.81.52 వద్ద ప్రారంభమైన రూపాయి క్రితం సెషన్‌ ముగింపుపై రూ.80.99తో పోలిస్తే 0.64 శౄతం పతనమైంది. అయితే గత తొమ్మిది సెషన్‌లలో మొత్తం ఎనిమిది సెషన్‌లలో రూపాయి పతనం కొనసాగింది. 2.28 శాతం మేర నష్టపోయింది. ఉదయం సమయంలో డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.81.56 వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసింది. దీంతో దేశంలో మ‌రోసారి ద్ర‌వ్యోల్బ‌ణ ప్ర‌భావం కొన‌సాగుతుంద‌నే భ‌యాలు వెంటాడుతున్నాయి.

అమెరికన్ కరెన్సీ బలపడటం, ఇన్వెస్టర్లలో రిస్క్ విముఖత స్థానిక యూనిట్‌పై తీవ్ర ప్రభావం చూపడంతో సోమవారం ప్రారంభ ట్రేడింగ్‌లో అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ 43 పైసలు క్షీణించి ఆల్ టైమ్ కనిష్ట స్థాయి 81.52 వద్దకు చేరుకుంది. అంతేకాకుండా ఉక్రెయిన్‌లో వివాదాల కారణంగా భౌగోళిక రాజకీయ ప్రమాదాలు పెరగడం, దేశీయ ఈక్విటీలలో ప్రతికూల ధోరణి, గణనీయమైన విదేశీ నిధుల ప్రవాహం పెట్టుబడిదారుల అతృతను తగ్గించాయని ఫారెక్స్ వ్యాపారులు తెలిపారు.

ఇంటర్‌బ్యాంక్ విదేశీ మారకం వద్ద, రూపాయి గ్రీన్‌బ్యాక్‌తో పోలిస్తే 81.47 వద్ద ప్రారంభమైంది. ఆపై 81.52కి పడిపోయింది. దాని మునుపటి ముగింపు కంటే 43 పైసల పతనం నమోదు చేసింది. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ గతవారం కీలక వడ్డీరేట్లను 75 బేసిస్‌ పాయింట్లు పెంచిన సంగతి తెలిసిందే. అయితే రానున్న రోజుల్లో రేట్ల పెంపు మరింత వేగంగా ఉంటుందని ఫెడ్‌ ఛైర్మన్ జెరోమ్‌ పావెల్‌ వెల్లడించారు. అలాగే ద్రవ్యోల్బణం తప్పదేమోనని హెచ్చరించారు. దీంతో ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే డాలర్‌ రోజురోజుకీ బలపడుతోంది. ఫలితంగా రూపాయికి డిమాండ్‌ తగ్గి మారకపు విలువ పడిపోతోంది.

ప్రస్తుతం మదుపర్లు ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష నిర్ణయాలపై దృష్టి సారించారు. రేపోరేటును మరో 50 బేసిస్‌ పాయింట్లు పెంచే అవకాశం ఉందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా, సెప్టెంబర్ 16తో ముగిసిన వారానికి దేశ ఫారెక్స్ నిల్వలు 5.219 బిలియన్ డాలర్లు క్షీణించి 545.652 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.

మాద్యం భయాలు..

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు ఈక్విటీ మార్కెట్లకు అనుకూలంగా లేవని నిపుణులు చెబుతున్నారు. అమెరికా బాండ్లపై రాబడి అధికంగా ఉన్న నేపథ్యంలో.. పెట్టుబడులు అటువైపు మళ్లే అవకాశం ఉందని తెలిపారు. 'ప్రపంచంలో ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశాలు పెరుగుతున్నాయి. అమెరికా ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేట్లు పెంచనున్నట్లు అంచనాలు ఉన్నాయి. ఈ మందగమనంలో భారత్ ఓ ఆశాకిరణంలా ఉన్నా.. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశీయ మార్కెట్లు పూర్తి రక్షణ పొందలేకపోతున్నాయి' అని విశ్లేషకులు చెబుతున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.