Begin typing your search above and press return to search.

జాతి వివక్షతో అమెరికాలో తెలుగోళ్లపై కాల్పులు

By:  Tupaki Desk   |   24 Feb 2017 4:46 AM GMT
జాతి వివక్షతో అమెరికాలో తెలుగోళ్లపై కాల్పులు
X
రెచ్చగొట్టే నాయకులు పాలకులుగా మారితే ఎంతటి దారుణ పరిణామాలకు తెర లేస్తుందో తెలియజేసే ఉదంతమిది. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన నాటి నుంచి జాతి వివక్షను తెర మీదకు తీసుకురావటమే కాదు.. అదే పనిగా వివక్షను రంగరించిపోసే ఆయన మాటలు కొందరి అమెరికన్లకు భారీగానే తలకెక్కిపోతున్నాయి. వలసతో ఏర్పడిందే తమ దేశమన్న బేసిక్ పాయింట్ మర్చిపోతున్న మూర్ఖుల మూర్ఖత్వం మనుషుల ప్రాణాలు తీసే వరకూ వెళ్లటం ఆందోళన కలిగించే అంశం. తాజాగా జాతివివక్షతో ఊగిపోయి.. తెలుగోళ్లపై కాల్పులు ఉదంతం చోటు చేసుకుంది. ఇందులో ఒక తెలుగు యువకుడు మరణిస్తే.. మరొకరు తీవ్రంగా గాయపడి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

అమెరికాలోని కన్సాస్ రాష్ట్రంలోని ఒలాతేలో బుధవారం రాత్రి (అమెరికా కాలమానం ప్రకారం) ఓ బార్ లో కాల్పులు చోటు చేసుకున్నాయి. గార్నిమ్ కంపెనీలో ఇంజనీర్లుగా పని చేస్తున్న వీరు.. ఒక బార్ లో ఉండగా.. అమెరికన్ ఒకరు ఆవేశంతో.. ‘మా దేశం నుంచి వెళ్లిపోండి ఉగ్రవాదుల్లారా..’ అంటూ జాత్యంహంకార వ్యాఖ్యలతో దూషించాడు. దీంతో.. బార్ యాజమాన్యం కలగజేసుకొని తీవ్ర వ్యాఖ్యలు చేసిన అమెరికా పౌరుడ్ని బార్ బయటకు పంపారు. కాసేపటికి తుపాకీతో వచ్చిన సదరు వ్యక్తి.. తెలుగు యువకుల మీద కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో కూచిబొట్ట శ్రీనివాస్ మరణించగా.. మాదసాని అలోక్ తీవ్రంగా గాయపడ్డారు. మరో అమెరికన్ కూడా గాయపడినట్లుగా చెబుతున్నారు.

మరణించిన కూచిబొట్ల శ్రీనివాస్ అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి.. ఉద్యోగం చేస్తున్నారు. గడిచిన రెండు వారాల వ్యవధిలో వివక్ష కారణంగా ఇద్దరు తెలుగు యువకులు మృత్యువాత పడటం గమనార్హం. ఈ ఘటన తెలుగువారిని తీవ్ర ఆందోళనలకు గురి చేస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/