Begin typing your search above and press return to search.
మన సైనికులు ఎంత పనిచేశారంటే!
By: Tupaki Desk | 18 Sep 2017 5:05 AM GMTభారత సైన్యం! పౌరుషానికీ.. ప్రతీకారానికే కాదు. సహనానికి - ఓర్పుకు - క్రమశిక్షణకు మారు పేరు. ఈ విషయంలో ప్రపంచ వ్యాప్తంగా భారత సైన్యానికి మంచి పేరు - మార్కులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా సైన్యం మాదిరిగా `బరితెగించే` వ్యవహారాలు - హద్దు మీరే చర్యలు మనోళ్లు చేయరని పెద్ద పేరు. అయితే, తాజాగా ఓ నలుగురు సైనికులు చేసిన `అతి` మన దేశం పరువును తీసి పారేసింది. ఇన్నాళ్లూ మనం పోగేసుకున్న మంచిని ఏకిపారేసేలా చేసింది. విషయంలోకి వెళ్తే.. ఈ నెల 10న జమ్ము కశ్మీర్ లోని నౌగామ్ జిల్లా పరిధిలో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థ లష్కరే తాయిబా ఉగ్రవాదులు భారత్ లోకి చొరబడి మన సైన్యంపై కాల్పులు జరిపారు. దీనిని ఎదుర్కొనే క్రమంలో మన సైనికులు కూడా ఎదురు కాల్పులకు దిగారు.
ఈ కాల్పుల్లో లష్కరే మూకకు చెందిన అబు ఇస్మాయిల్ - చోటా ఖాసిమ్ లు అక్కడికక్కడే హతమయ్యారు. వీరిద్దరికీ ఇటీవల అమర్ నాథ్ యాత్రికులపై జరిగిన దాడిలో ప్రమేయం ఉంది. దీంతో వీరిని హతమార్చిన ఘటనపై దేశం మొత్తం మన సైనికులకు నీరాజనం పలికింది. ఇంత వరకు బాగానే ఉంది. అయితే అలా హతమైన ఉగ్రవాదుల మృత దేహాలు రోడ్డు మీద పడ్డాయి. వీటిని సక్రమ పద్ధతిలో సైన్యం స్వాధీనం చేసుకునేలోగానే.. ఓ నలుగురు సైనికులు ఈ రెండు మృత దేహాల కాళ్లకు తాళ్లు కట్టి కొంత దూరం వరకు రోడ్డు మీద లాక్కొచ్చారు. అనంతరం వీరిలోని మరో ఇద్దరు సైనికులు ఈ మృతదేహాల గుండెలపై బూటు కాళ్లు పెట్టి తన్ని తమ కసి తీర్చుకున్నారు.
ఇదే ఇప్పుడు దేశ సైన్యం పరిస్థితిని ఆత్మర క్షణలో పడేసింది. ఈ మొత్తం ఉదంతాన్ని ఎవరో వీడియో తీశారు. మృతదేహాలను ఈడ్చడం - బూటు కాళ్లతో తన్నడం వంటివి ఈ వీడియోలో స్పష్టంగా కనిపించాయి. దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నిమిషాల వ్యవధిలో ఈ వీడియో విపరీతంగా వైరల్ అయింది. దీంతో లష్కరే ఉగ్రవాద కమాండర్ తీవ్ర స్థాయిలో భారత్‌పై ఫైరయ్యాడు. భారత సైన్యం వికృత రూపం ఇదేనంటూ కామెంట్లు కుమ్మరించాడు. అంతకు అంత ప్రతీకారం తీర్చుకుంటామని శపథం చేశాడు. మరోపక్క, ఈ ఉదంతంపై భారత సైన్యంలోని ఉన్నతాధికారులు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సైన్యం కట్టు తప్పుతోందని సాక్షాత్తూ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో స్పందించిన భారత రక్షణ శాఖ అధికార ప్రతినిధి కల్నల్ రాజేష్ కలియా మాట్లాడుతూ.. ఓ నలుగురు సైనికులు చేసిన పనితో భారత సైన్యం పరువు పోయిందని వ్యాఖ్యానించారు. వీరిపై శాఖపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మొత్తానికి ఈ వీడియోపై మిశ్రమ స్పందన వ్యక్తమైంది. కొందరు.. నెటిజన్లు.. భారత సైనికులు చేసిన చర్యలు సమర్థించగా.. మరికొందరు మాత్రం `శవాలతో ఇలా చేయడం తప్పు` అని నిరసించారు.