Begin typing your search above and press return to search.

ఆస్ట్రేలియాలో మ‌నోడి దుర్మ‌ర‌ణం..అదే కార‌ణ‌మ‌ట‌

By:  Tupaki Desk   |   21 May 2018 5:57 PM GMT
ఆస్ట్రేలియాలో మ‌నోడి దుర్మ‌ర‌ణం..అదే కార‌ణ‌మ‌ట‌
X
సెల్‌ ఫోన్ కాస్త హెల్ ఫోన్‌ గా మారుతోంది. యువ‌త సెల్ఫీ మోజులో ప‌డి ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఉదంతాలు నిత్యం చోటుచేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా అలాంటి ప్ర‌మాద‌క‌ర ఘ‌ట‌న‌లోనే ఆస్ట్రేలియాలో మ‌నోడు ఒక‌రు మృతిచెందారు. సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు సముద్రంలో పడి భారతీయ యువకుడొకరు మృతిచెందిన విషాదకర సంఘటన పశ్చిమ ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. అంకిత్‌ (20) తన మిత్రులతో కలిసి - ప్రఖ్యాత పర్యాటక ప్రాంతమైన ఆల్‌ బనీలోని పోర్ట్‌ టౌన్‌ కు వెళ్లాడు. అక్కడ 40 మీటర్ల ఎత్తులో ఉన్న కొండచరియలపైకి ఎక్కి సెల్ఫీ తీసుకుంటుండగా అదుపుతప్పి సముద్రంలో పడి మృతి చెందాడు.

ఆస్ట్రేలియాలోని పెర్త్‌ లో చదువుకుంటోన్న అంకిత్ స్నేహితులతో కలిసి పోర్ట్‌ టౌన్‌ కు వెళ్లాడు.సెల్ఫీ కోసం అందరూ అక్కడున్న రాళ్లమీదకి చేరారు. అయితే అంకిత్ కాలు జారి ఒక్కసారిగా సముద్రంలో పడిపోయాడు. 'అతడు జాగ్రత్తగా ఫోటోలు దిగాడు. కానీ కాలు జారడం వల్లే ఇలా జరిగింది' అని అంకిత్ స్నేహితుడు తెలిపాడు.రెస్క్యూ హెలిక్యాప్టర్‌ను రంగంలోకి దింపి గంటలోనే సముద్రం నుంచి మృతదేహాన్ని వెలికితీశామని స్థానిక పోలీస్‌ అధికారి తెలిపారు. ‘చిన్నపాటి నిర్లక్ష్యం కారణంగా యువకుడు ప్రాణాలు కోల్పోవడం చాలా విషాదకరం. మృతుడి తల్లిదండ్రులకు సమాచారం అందిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.