Begin typing your search above and press return to search.

ఉక్రెయిన్ సైన్యంలో చేరిన భారత విద్యార్థి.. తల్లిదండ్రుల గగ్గోలు

By:  Tupaki Desk   |   8 March 2022 11:23 AM GMT
ఉక్రెయిన్ సైన్యంలో చేరిన భారత విద్యార్థి.. తల్లిదండ్రుల గగ్గోలు
X
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం మూడో వారంలో మరింత ఉధృతంగా సాగుతోంది. ఉక్రెయిన్ లోని కీలక పట్టణాలు, సైనిక స్థావరాలపై భీకరదాడులు చేస్తూ పుతిన్ బలగాలు ముందుకుపోతున్నాయి. పెద్ద ఎత్తున రష్యా సైనికులను , ఉన్నతాధికారులను మట్టుబెట్టామని ఉక్రెయిన్ బలగాలు ప్రకటించుకున్నాయి. ఇప్పటికే వేలాది భవనాలు ధ్వంసమైపోగా.. అందులో 200కు పైగా స్కూళ్లు, 30కి పైగా ఆస్పత్రులు ఉన్నట్టు సమాచారం.

శాంతి చర్చలు విఫలమవుతున్న క్రమంలో రక్తపాతం మరింతగా పెరుగుతున్నది. ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయుల్లో దాదాపు అందరినీ స్వదేశానికి రప్పించింది కేంద్రం. కానీ ఇంకొందరు మాత్రం విధిలేని స్థితిలో మరికొందరు స్వచ్చందంగా అక్కడే ఉండిపోతున్నారు.

అయితే తాజాగా తమిళనాడుకు చెందిన ఓ విద్యార్థి అయితే ఏకంగా ఉక్రెయిన్ సైన్యంలో చేరిపోవడం సంచలనంగా మారింది. మెడిసిన్ చదివేందుకు ఉక్రెయిన్ దేశానికి వెళ్లిన సాయినికేషన్ రవిచంద్రన్ అనే తమిళనాడు విద్యార్థి రష్యా దండయాత్ర నేపథ్యంలో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. రష్యాకు వ్యతిరేకంగా పోరాడేందుకు అతడు ఉక్రెయిన్ లోని పారామిలటరీ దళంలో చేరాడు.

కొడుకు ఉక్రెయిన్ సైన్యంలో చేరాడని తల్లిదండ్రులకు సమాచారం అందడంతో వాళ్లు ఆందోళనకు గురయ్యారు. సాయినికేష్ వ్యవహారాన్ని భారత రాయబార కార్యాలయం తీవ్రంగా పరిగణిస్తూ దర్యాప్తు చేసింది. తమిళనాడుకు చెందిన సాయినికేషన్ 2018లో ఉక్రెయిన్ లోని ఖార్కివ్ నగరంలో గల నేషనల్ ఏరోస్పేస్ యూనివర్సిటీలో చేరాడు.

అతడు మెడిసిన్ కోర్సును ఈ ఏడాది జులైలో ముగించుకున్నాడు. నాలుగేళ్లు ఉక్రెయిన్ తో ఉన్న అనుబంధంతో ఇప్పుడతడు రష్యాకు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నాడు. ఉక్రెయిన్ పారా మిలటరీ బలగాలతో కలిసి సాయినికేషన్ దిగిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

సాయినికేష్ కోసం అక్కడి రాయబార కార్యాలయం సహాయాన్ని అతడి తల్లిదండ్రులు కోరారు. ఉక్రెయిన్ దేశంలో ఉన్న భారత రాయబార కార్యాలయ అధికారులు ఎట్టకేలకు సాయినికేషన్ ను సంప్రదించారు. తాను రష్యాతో పోరాడేందుకు ఉక్రెయిన్ పారామిలటరీ దళంలో చేరినట్లు సాయినికేషన్ తల్లిదండ్రులకు తెలిపారు. అతడిని ఒప్పించి తిరిగి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.