Begin typing your search above and press return to search.
శరత్ కొప్పును చంపినోడు..మహా దుర్మార్గుడు
By: Tupaki Desk | 20 July 2018 6:49 AM GMTఅమెరికాలోని కన్సాన్ సిటీలోని ఓ రెస్టారెంట్ లో ఈ నెల 6న గుర్తు తెలియని అగంతకుడు కాల్పులు జరపడంతో తెలుగు బిడ్డ కొప్పు శరత్ మృతి చెందిన విషయం విదితమే. మిసోరిలోని కన్సాస్‌లో ఓ రెస్టారెంట్‌లో దోపిడీ చేయడానికి వెళ్లిన నల్లజాతీయులు జరిపిన కాల్పుల్లో శరత్ చనిపోయాడు. జేస్ ఫిష్ అండ్ చికెన్ మార్కెట్‌లో కొందరు వ్యక్తులు జరిపిన కాల్పుల్లో శరత్ భుజంలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. అతన్ని వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ శరత్ చనిపోయాడు. కాగా, ఈ ఉదంతంలో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. నిందితుడు నల్లజాతీయుడి అయిన మార్లిన్ జేమ్స్ మాక్ అని గుర్తించిన పోలీసులు.. అతడి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. సీసీటీవీ పుటేజ్ సహా ఇతర వివరాల ఆధారంగా ఆ దుండగుడి నివాసం కనుగొన్న పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా దుండగుడు కాల్పులు జరిపాడు. దీంతో పోలీసులు సైతం కాల్పులు జరపగా ఆ నిందితుడు మరణించాడు. కాగా ఈ ఘటనలో ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి. అయితే నిందితుడు మార్లిన్ మాక్ గురించి అనేక ఆసక్తికరమైన విషయాలు తెరమీదకు వచ్చాయి.
పాతికేళ్ల వయసు గల మార్లిన్ జీవితంలో నేరమయమైన భాగమే ఎక్కువ అని తేలింది. కన్సాస్ కు చెందిన ఓ మీడియా సంస్థ వార్తకథనం ప్రకారం మార్లిన్ 15 ఏళ్ల వయసులో తొలిసారిగా అరెస్ట్ అయ్యాడు. పదిహేనేళ్ల వయసులో రెండు కార్ల అద్దాలు పగలగొట్టినందుకు ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్కూలుకు గన్ తీసుకువచ్చిన ఉదంతం ఆయన మళ్లీ జైలుపాలయ్యాడు. రెండేళ్ల అనంతరం ఓ మహిళను గన్ పాయింట్ లో గురిపెట్టి దోచుకున్న ఘటనలో మార్లిన్‌కు ఐదేళ్ల శిక్షపడింది.2015లో జైలు నుంచి విడుదలయిన మార్లిన్ మారణాయుధం ధరించిన కేసులో తిరిగి జైలుపాలయ్యాడు. ఈ ఏడాది జనవరిలో విడుదల అయిన ఆయన...అనంతరం పాల్పడ్డ ఘాతుకం వల్ల శరత్ కొప్పు దుర్మరణం పాలయ్యాడు.
కాగా, యూనివర్సిటీ ఆఫ్ మిస్సోరిలో ఎంఎస్ చేసేందుకు శరత్.. ఆర్నేళ్ల కిందటే అమెరికా వెళ్లారు. చదువుకుంటూ ఉద్యోగం చేస్తున్న కొప్పు శరత్ ఇలా దురదృష్టకరమైన ఘటనలో కన్నుమూశారు. అయితే స్వల్పకాలంలోనే శరత్ అమెరికాలో తన ప్రత్యేకతను చాటుకున్నాడు. శరత్ ఆరునెలల వ్యవధిలోనే అమెరికాలోని భారతీయులకు ఉపయోగపడే ఆవిష్కరణచేశాడు. అమెరికాకు వచ్చే వివిధ దేశాలవారిలో ఇంగ్లిష్ తెలియనివారికి ఇబ్బందులు తప్పవు. అలాంటివారు అడ్రస్‌లు, ఇతర స్థానిక విషయాలు తెలుసుకోవడంలో ఉపయోగపడేలా ఒక మొబైల్ యాప్‌ను రూపొందించడంపై శరత్ పనిచేశాడు. మిస్సోరి యూనివర్సిటీ విద్యార్థిగా తాను రూపొందిస్తున్న యాప్ వివరాలను శరత్ యూట్యూబ్‌లో వివరించాడు. ఎవరైనా ఇంగ్లిష్ చదవడం రానివాళ్లు దానిని తమ భాషలో చదువుకునే సౌలభ్యం కల్పించాడు. ఉదాహరణకు ఏదైనా ప్రాంతానికి సంబంధించిన సైన్‌బోర్డు కనిపిస్తే దాని ఫొటో తీసి, శరత్ రూపొందించిన యాప్‌లో అప్‌లోడ్ చేసి, వారికి తెలిసిన భాషపై క్లిక్ చేస్తే ఆ పేరు వారు కోరుకున్న భాషలో కనిపిస్తుంది.