Begin typing your search above and press return to search.

డాల‌ర్ క‌ల క‌ల్ల‌ల‌వుతున్న వేళ‌

By:  Tupaki Desk   |   29 Dec 2015 6:59 AM GMT
డాల‌ర్ క‌ల క‌ల్ల‌ల‌వుతున్న వేళ‌
X
క‌ల చెదురుతోంది.. ఆశ‌లు పెట్టుకుని అగ్ర‌రాజ్యంలో అడుగుపెట్టిన విద్యార్థుల ఊహ‌లు క‌ల్ల‌ల‌వుతున్నాయి.. పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటూ చ‌దువుకుంటున్న వారి ఆశ‌ల‌కు అక్క‌డి అధికారులు గండికొడుతున్నారు. పార్ట్‌ టైం ఉద్యోగాలు చేస్తున్న‌వారే ల‌క్ష్యంగా అక్కడి అధికారులు ర‌క‌ర‌కాల త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు.. ముఖ్యంగా అమెరికాలో విద్యను అభ్యసించేందుకు వెళ్లి వర్సిటీల వెలుపల పార్ట్‌ టైమ్ ఉద్యోగాలు చేస్తున్న భారత విద్యార్థుల పట్ల కఠినంగా వ్యవహరించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్ర‌భుత్వ ఆదేశాల‌తో అన్ని రాష్ట్రాల్లో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌ బీఐ) తనిఖీలు చేపట్టి ఎంఎస్ చేస్తున్న‌ దాదాపు 150 మంది విద్యార్థుల‌ను పట్టుకుంది.

ఎఫ్‌ బీఐ ప‌ట్టుకున్న 150 మంది విద్యార్థుల్లో 38 మంది తెలుగు విద్యార్థులు కూడా ఉన్నారు. ఆ విద్యార్థుల పాస్‌ పోర్టుల‌ను స్వాధీనం చేసుకున్న ఎఫ్‌ బీఐ భార‌త రాయ‌బార కార్యాల‌యానికి సమాచారమిచ్చింది. ‘కొందరు విద్యార్థులను ఎఫ్‌ బీఐ అదుపులోకి తీసుకున్న విషయం మా దృష్టికి వచ్చింది. యూనివర్సిటీలకు సెలవుల కారణంగా బయట పార్ట్‌ టైమ్ ఉద్యోగాలు చేస్తున్నందువల్ల మొదటి తప్పుగా భావించి వదిలేయాలని మేం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాం..’’ అని తానా అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. గుర్తింపు లేని విశ్వవిద్యాలయాలు ఇచ్చిన ‘ఐ20 (అడ్మిషన్ ధ్రువపత్రం)’తో అమెరికా వెళుతున్న విద్యార్థులను అక్కడి ఇమిగ్రేషన్ అధికారులు నిర్దాక్షిణ్యంగా వెనక్కి పంపుతున్నారు.

అమెరికాలో చదువుకునేందుకు అవసరమైన ఆర్థిక వనరులు చూపని మరో 20 మంది భారత విద్యార్థులను షికాగోలో పోలీసులు వెనక్కి పంపిన నేపథ్యంలో... స్ప్రింగ్ సీజన్ (డిసెంబర్‌లో మొదలయ్యే విద్యాసంవత్సరం)లో చదువుకునేందుకు అమెరికా వీసా పొందిన విద్యార్థులు ఆందోళనలో పడ్డారు. భారత్ నుంచి అమెరికా వెళ్లాల్సిన విద్యార్థులు దాదాపు 6 వేల మంది తాత్కాలికంగా ఆగిపోయారని... ఆయా వర్సిటీల నుంచి గ్రీన్‌ సిగ్నల్ వచ్చిన తర్వాత బయలుదేరుతారని న్యూయార్క్‌ లో భారత విద్యార్థుల స్థితిగతులను చూసే ఓ కన్సల్టెన్సీ యజమాని హర్‌ ప్రీత్‌ సింగ్ వెల్లడించారు. భారత విద్యార్థులు చదువు కంటే పార్ట్‌ టైమ్ ఉద్యోగాలకు ప్రాధాన్యతనిస్తున్నారని ఎఫ్‌ బీఐ పేర్కొన్న నేపథ్యంలో... గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని, కొంత స్పష్టత వచ్చేదాకా విద్యార్థులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిదని ఆయన సూచించారు.

దీనిని బ‌ట్టి చూస్తుంటే ఆర్థిక‌స్తోమ‌త బాగున్న‌వారే అమెరికాలో చ‌దువుకునేందుకు వెళ్ల‌డం మంచిది. పార్ట్‌ టైం ఉద్యోగాల మీద బేస్ అయ్యి అక్క‌డ చ‌దువుకోవాల‌ని క‌ల‌లు కంటున్న విద్యార్థుల క‌ల‌లు క‌ల్ల‌ల‌వుతున్నాయి. ఇప్ప‌టికే అక్క‌డ చ‌దువుకుంటున్న విద్యార్థులు పార్ట్ టైం జాబ్‌ ల‌కు స్వ‌స్తి ప‌లికి పూర్తిగా చ‌దువుమీదే కాన్‌ సంట్రేష‌న్ చేస్తే మంచిది. లేకుంటే వారి బంగారు క‌ల‌లు క‌రిగేపోయే ప్ర‌మాదం ఉంది.