Begin typing your search above and press return to search.

అమెరికా స్ట‌డీ అంటే మ‌నోళ్లు లైట్ తీసుకుంటున్నారు

By:  Tupaki Desk   |   4 Jun 2017 6:39 AM GMT
అమెరికా స్ట‌డీ అంటే మ‌నోళ్లు లైట్ తీసుకుంటున్నారు
X
అమెరికా అంటే విద్యాఉద్యోగ రంగంలో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అయితే అధ్యక్షులు డొనాల్డ్‌ ట్రంప్‌ అనుసరిస్తున్న విధానాల కారణంగా ఉన్నత విద్య కోసం ఆ దేశానికి వెళ్ళాలని భావిస్తున్న భారత విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. ఇది భారత్‌ కు అనుకూల పరిణామంగా విశ్లేషకులు భావిస్తున్నారు. వివిధ ఐఐటీల నుంచి అమెరికా వెళ్లేవారి సంఖ్య గత రెండేళ్లల్లో 20 నుంచి 30 శాతం వరకు తగ్గగా, రానున్న సంవత్సరాల్లో ఈ సంఖ్య మరింతగా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా భారత్‌ లోని ప్రముఖ ఐఐటీల నుంచి అమెరికా వెళ్లే విద్యార్థుల సంఖ్య గత రెండేళ్ల నుంచి తగ్గుతోంది. దీనికి ట్రంప్‌ అనుసరిస్తున్న రక్షణాత్మక విధానాలతో పాటు స్వదేశంలో ఐఐటీ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు పెరగడాన్ని కారణంగా భావిస్తున్నారు. 2016 గణాంకాల ప్రకారం అమెరికాకు విద్యార్థులను పంపే విషయంలోనూ, వృద్ధి రేటులోనూ ప్రపంచ దేశాల్లో భారత్‌ రెండో స్థానంలో ఉంది. చైనా నుంచి అమెరికాకు అత్యధిక మంది విద్యార్థులు వెళ్లేవారు. అయితే 2016లో అమెరికా వెళ్లే విద్యార్థుల వృద్ధి రేటు 19 శాతం మాత్రమే. అంతకు ముందు ఏడాది 2015లో ఈ వృద్ధిరేటు 32 శాతం ఉంది.

'విద్యార్థులకు ఇక్కడ మంచి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. అలాగే అమెరికా నుంచి వర్క్‌ వీసాలు రావడంపై కూడా అనిశ్చితి నెలకొంది. దీంతో అమెరికా వెళ్లడానికి ఇక్కడి విద్యార్థులు ఇష్టపడ్డం లేదు ఐఐటీ కాన్పూర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ మనింద్రా అగర్వాల్‌ తెలిపారు. తమ కాలేజ్‌ నుంచి అమెరికా వెళ్లే వారి సంఖ్య రెండేళ్లలో 30 శాతం తగ్గినట్లు ఆయన చెప్పారు. అమెరికాలో పరిస్థితులతో పాటు దేశంలో మంచి ఉద్యోగాలు - భారీ వేతనాలు లభిస్తుండటాన్ని ఇందుకు కారణాలుగా చెప్పారు. అలాగే ప్రస్తుతం విద్యార్థులు సాంకేతికంగా సమస్యలు వున్న అవకాశాలు కన్నా, లాభదాయకమైన ఆఫర్లను ఎంపిక చేసుకుంటున్నారని, అమెరికా వెళ్లే విద్యార్థుల సంఖ్య తగ్గడానికి ఇదీ ఒక కారణమని ఐఐటి వారణాసి డైరెక్టర్‌ రాజీవ్‌ సంగాల్‌ తెలిపారు. అలాగే స్వదేశంలో వుండాలని విద్యార్థులకు వారి తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి వస్తోందని రాజీవ్‌ తెలిపారు. 'ఐఐటి ఢిల్లీ నుంచి అమెరికా వెళ్లే వారి సంఖ్య గణనీయంగా తగ్గినట్లు ఆ సంస్థ డైరెక్టర్‌ వి రామ్‌ గోపాల్‌ రావు తెలిపారు. 'గత దశాబ్ధంలో అమెరికా వెళ్లే విద్యార్థుల సంఖ్య 50 నుంచి 60 శాతం తగ్గింది' అని రామ్‌ గోపాల్‌ తెలిపారు. ఈ పరిణామాలకు అమెరికా రక్షణాత్మక విధానమే కారణమన్నారు.

అమెరికాలో ప్రస్త్తుత రాజకీయ వాతావరణం విద్యార్థులకు ఆశాజనకంగా లేక‌పోవ‌డం ఒక కార‌ణంగా నిపుణులు చెప్తున్నారు. వలస వ్యతిరేక విధానాలు విద్యార్థులను ఆందోళనలకు గురి చేస్తున్నాయని, హెచ్‌-1బీ వీసాలు, ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ కార్యక్రమాలు విద్యార్థుల ఉపాధి అవకాశాలపై ప్రభావం చూపుతున్నాయని పేర్కొంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/