Begin typing your search above and press return to search.

ప్ర‌పంచంతో పోలిస్తే మ‌న జీఎస్టీ ఎట్లుంది?

By:  Tupaki Desk   |   1 July 2017 5:35 AM GMT
ప్ర‌పంచంతో పోలిస్తే మ‌న జీఎస్టీ ఎట్లుంది?
X
జీఎస్టీ గురించి అధికార పార్టీ చాలా గొప్ప‌లు చెబుతోంది. మ‌రి.. ఆ గొప్ప‌ల్లో నిజం ఎంత‌? అన్న‌ది పెద్ద సందేహం. ఆర్థిక అంశాలు ఒక ప‌ట్టాన అర్థం కావ‌న్న భావ‌న చాలామందిలో ఉంటుంది. నిజానికి ఆ ఆలోచ‌నే ఆర్థిక అంశాల‌కు సంబంధించిన కీల‌క విష‌యాల మీద పూర్తిస్థాయిలో అవ‌గాహ‌న లేకుండా చేస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. జీఎస్టీ సాంకేతిక అంశాల్ని ప‌క్క‌న పెట్టేస్తే.. సింఫుల్ గా ఈ స‌రికొత్త ప‌న్నుల విధానం అమ‌లు అవుతున్న వేళ ఒక విష‌యంపై అవ‌గాహ‌న పెంచుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.

ముందుగా ప‌న్ను అన్న‌ది ఏమిటి? అన్న‌ది చూస్తే.. మ‌న జేబులో ఉన్న డ‌బ్బుల్లో కొంత భాగాన్ని ప్ర‌భుత్వం తీసేసుకోవ‌టం. ఎందుకిలా అంటే.. పాల‌నా ర‌థం న‌డిపించాలి కాబ‌ట్టి. ప్ర‌జ‌ల‌కు వ‌స‌తులు.. ర‌క్ష‌ణ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే చేయాలి కాబ‌ట్టి.. ఆ ఖ‌ర్చుల‌కు అవ‌స‌ర‌మ‌య్యే ఆదాయాన్ని స‌మ‌కూర్చుకోవ‌టం కోసం ప‌న్ను వేస్తారు. ఒక్కో దేశంలో ఒక్కోలా ప‌న్ను వేస్తుంటారు. దేశానికి దేశానికి ప‌న్నుల శాతంలో మార్పులు ఉంటాయి.

ఈ ప‌న్నుల విధానానికి సంబంధించి నిన్న‌టి వ‌ర‌కూ మ‌న దేశంలోనే ఒక్కోరాష్ట్రంలో ఒక్కోలా ఉంది. వీటిని స‌రి చేసి.. ఒకే దేశం.. ఒకే ప‌న్ను కాన్సెప్ట్ ను జీఎస్టీ రూపంలో తీసుకొచ్చారు.

ఇక్క‌డ చూడాల్సిందేమిటంటే.. తాజా జీఎస్టీలో విధించే ప‌న్నును చూస్తే.. క‌నిష్ఠంగా 0 తో మొద‌లై గ‌రిష్ఠంగా 28 శాతం వ‌ర‌కూ ఉంది. ఇంకాస్త లోతుగా ప‌న్నుల జాబితాను చూస్తే.. చాలావ‌ర‌కూ ప‌న్నులు 18 శాతం మీద‌నే ఉండ‌టం క‌నిపిస్తుంది. అంటే వంద‌కు రూ.18 అన్న మాట‌. దీనికి ముందు మ‌నం సంపాదించే ఆదాయంలో ఆదాయ‌ప‌న్ను రూపంలో వంద‌కు క‌నీసం రూ.10 తీస్తే (బ‌డుగు వ‌ర్గాలు.. దిగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి జీవుల్ని మిన‌హాయిస్తే. అదే స‌మ‌యంలో సంప‌న్నుల‌కైతే వారు సంపాదించే ప్ర‌తి వంద‌కు రూ.30 వ‌ర‌కు ప‌న్ను రూపంలో పోతుంది నిజాయితీగా చెల్లిస్తే) వంద‌లో రూ.28 కేవ‌లం ప‌న్నుల రూపంలో పోవ‌టం క‌నిపిస్తుంటుంది. ఇది మినిమం అన్న‌ది మ‌ర్చిపోకూడ‌దు.

ఇక‌.. ప్ర‌భుత్వానికి విలాసంగా క‌నిపించేవి ఈ రోజున నిత్య‌వ‌స‌రంగా మారిన ప‌రిస్థితి. అయిన‌ప్ప‌టికీ ఆ విష‌యాన్ని ప‌ట్టించుకోని ప్ర‌భుత్వం విలాసంగా చూస్తూ అధిక శాతం ప‌న్నుల్ని బాదేసింది. తాజాగా అమ‌ల్లోకి వ‌చ్చిన జీఎస్టీ ప‌న్నుల విధానంలో జ‌నాల మీద వేసే ప‌న్నుల భారం పెరుగుతుంద‌న‌టంలో సందేహం లేదు. అయితే.. భారం తగ్గుతుంద‌న్న‌ది అధికార‌ప‌క్ష నేత‌ల వాద‌న‌.

ఈ వాద‌న‌ల్ని ప‌క్క‌న పెట్టి నిజాలు చెప్పే అంకెల్లోకి వెళితే.. ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంత ప‌న్నులు వ‌డ్డిస్తున్నారో చూస్తే.. మ‌న ద‌గ్గ‌ర ప‌న్నులు ఏ స్థాయిలో బాదుతున్నారో ఇట్టే అర్థ‌మ‌వుతుంది. కెన‌డాలో ప‌న్ను 5 శాతం. మ‌లేషియాలో 6 శాతం. థాయిలాండ్ లో 7 శాతం.. జ‌పాన్‌.. స్విట్జ‌ర్లాండ్ లో 8 శాతం.. ఆస్ట్రేలియాలో 10 శాతం.. ద‌క్షిణాఫ్రియాలో 14 శాతం.. న్యూజిలాండ్ లో 15 శాతం.. మెక్సికోలో 16 శాతం.. చైనాలో 17 శాతం.. ర‌ష్యాలో 18 శాతం.. బ్రిట‌న్‌.. ఫ్రాన్స్ లో 20 శాతం.. బ్రెజిల్ లో 4 శాతం నుంచి 25 శాతం వ‌ర‌కు వ‌డ్డిస్తున్నారు. ఇప్పుడు చెప్పిన దేశాల్లోని ప్ర‌జ‌ల‌కు అక్క‌డి ప్ర‌భుత్వాలు అందిస్తున్న మౌలిక స‌దుపాయాలు.. వ‌స‌తులు..ర‌వాణా సౌక‌ర్యాలు అన్ని లెక్క‌లోకి తీసుకొని మ‌న మీద ప్ర‌భుత్వాలు వేసే ప‌న్నులను పోల్చుకుంటే.. బాదుడు ఏ స్థాయిలో ఉంటుందో అర్థ‌మ‌వుతుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/