Begin typing your search above and press return to search.

ఐజోలేషన్‌ లో మహిళా టెక్కీ భర్త

By:  Tupaki Desk   |   4 March 2020 5:29 PM GMT
ఐజోలేషన్‌ లో మహిళా టెక్కీ భర్త
X
కరోనా వైరస్ అనుమానిత మహిళా సాఫ్టువేర్ ఇంజనీర్‌తో కలిసి పని చేసిన 23 మంది సహోద్యోగులను రెండు వారాల పాటు ఇంటికి పరిమితం కావాలని సూచించినట్లు ఆరోగ్య శాఖ అధికారులు బుధవారం వెల్లడించారు. సదరు మహిళా టెక్కీ భర్త మరో కంపెనీలో పని చేస్తున్నారు. అతను కూడా సెల్ఫ్ ఐజోలేషన్‌ లో ఉన్నట్లు తెలిపారు. మహిళా టెక్కీ - ఆమె భర్త పని చేస్తున్న ఆ రెండు కంపెనీల మిగతా ఉద్యోగులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని అధికారులు తెలిపారు.

మాదాపూర్‌ లోని మైండ్ స్పేస్ రహేజా ఐటీ పార్క్‌ లోని ఒక బిల్డింగ్ మాత్రమే బుధవారం మూసివేసినట్లు ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్టుమెంట్ వెల్లడించింది. శానిటైజేషన్ కోసం దానిని క్లోజ్ చేశారని - మిగతా అన్ని కంపెనీలు కూడా గురువారం నుండి యథాతథంగా పని చేస్తాయని స్పష్టం చేసింది.

ఇటీవల ఇటలీ నుండి వచ్చిన మహిళా టెక్కీకి కరోనా వైరస్ (కోవిడ్ 19) సోకినట్లుగా అనుమానిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఢిల్లీలో ఒక కేసు నమోదు కాగా రెండో కేసు హైదరాబాదులో నమోదయింది. వారి నమూనాలను పుణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పరీక్షల నిమిత్తం పంపించారు.

సదరు మహిళా టెక్కీ మైండ్ స్పేస్‌ లోని బిల్డింగ్ నెంబర్ 20లోని 9వ అంతస్తులోని కంపెనీలో పని చేస్తోంది. ఈ కంపెనీలో మొత్తం 350 మంది ఉద్యోగులు ఉన్నారని - కానీ 23 మంది మాత్రమే ఆమె పని చేస్తోన్న విభాగంలో ఉన్నారని తెలంగాణ ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ వెల్లడించారు. ఇప్పటి వరకు దేశంలో విదేశాల నుండి వచ్చిన వారికి మాత్రమే కరోనా సోకిందన్నారు. డీఎస్ ఎం ఉద్యోగికి కరోనా వచ్చిందనే వార్తల్లో నిజం లేదని చెప్పారు. మైండ్ స్పేస్ అంతా ఖాళీ అవుతుందనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. రేపటి నుండి కంపెనీలు అన్నీ నడుస్తాయన్నారు.

ఇక సదరు మహిళా టెక్కీ భర్త మైండ్ స్పేస్ సమీపంలోని పూర్వ సమ్మిట్‌ లో గల బ్రిటిష్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ కంపెనీలో 65 మంది ఉద్యోగులు ఉన్నారని, వీరికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారని చెప్పారు. టెక్కీ భర్తను ముందు జాగ్రత్త చర్యగా సెల్ఫ్ ఐజోలేషన్‌లో ఉండాలని సూచించినట్లు చెప్పారు.

మరో రెండు కంపెనీలు కూడా ఇంటి నుండి పని తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయన్నారు. ప్రజలను కొన్ని అంశాలు అనవసరమైన భయాందోళనలకు గురి చేస్తున్నాయని, ఐటీ కంపెనీలు ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి ముందు డిపార్టుమెంట్‌ను కలవాలని సూచించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ లేదా సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్‌ను కలవాలన్నారు.

మైండ్ స్పేస్‌ ను పూర్తిగా క్లోజ్ చేశారని కొంతమంది సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని - సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ అన్నారు. ఐటీ కారిడార్ ఖాళీ కాలేదని - వదంతులు నమ్మవద్దని - అసత్య ప్రచారాలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గురువారం నుండి అన్ని కంపెనీలు యథావిధిగా పని చేస్తాయన్నారు. కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించినందున ఐటీ సహా వివిధ రంగాల కంపెనీలు తమ ఉద్యోగులను ప్రస్తుతం విదేశాలకు పంపించవద్దని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ రావు సూచించారు.