Begin typing your search above and press return to search.

ట్విటర్ కు దెయ్యం పట్టిందా ఏంటి? పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తోంది?

By:  Tupaki Desk   |   29 Jun 2021 11:30 AM GMT
ట్విటర్ కు దెయ్యం పట్టిందా ఏంటి? పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తోంది?
X
వెనుకటికి తిక్కతిక్క వేషాలు వేసే వారిని చూసి ‘దెయ్యం పట్టిందా?’ అని అడిగేవారు. వారికి మంత్రాలు, చింతకాయలు, నిమ్మకాయలు, నెమలి ఈకలతో దిష్టితీసేవారు. ఇప్పుడు అమెరికాకు చెందిన సోషల్ మీడియా దిగ్గజం ‘ట్విటర్ ’కు కూడా అలాంటి దుమ్ము దులుపాల్సిన సమయం ఆసన్నమైందని అంటున్నారు.

భారతదేశంలో ట్విటర్ కు యమ క్రేజ్ ఉంది. ఈ అమెరికా నుంచి పనిచేసే సోషల్ మీడియా దిగ్గజానికి భారత్ అంటే అలుసు అయిపోయింది. భారత ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తోంది. కేంద్రమంత్రులు, ఉపరాష్ట్రపతి ఖాతాలనే బ్లాక్ చేస్తూ ఆటలు ఆడుతోంది. నూతన ఐటీ నిబంధనలు పాటించకుండా.. భారత్ లో ట్విట్టర్ బాధ్యులను పెట్టకుండా కేంద్రంతోనే ఢీకొంటోంది.

దాని పాపులారిటీ, గొప్పతనం ఎంత ఉన్నా భారత ప్రభుత్వంతో ట్విట్టర్ ఆడుతున్న తీరు మాత్రం సగటు నెటిజన్లకు కూడా మంటపుట్టిస్తోంది. మా దేశంలో ఉంటూ మా దేశ నేతలు, ప్రభుత్వాలను అవమానిస్తావా? అని నెటిజన్లు మండిపడుతున్నారు.

ఈ క్రమంలోనే నిన్న మరో దుమారం రేపింది. భారత్ లోని కశ్మీర్ ను ప్రత్యేక దేశంగా, లఢక్ ను చైనాలో భాగంగా చూపిస్తూ ట్విట్టర్ మరోసారి ధిక్కారానికి పాల్పడింది. కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూకశ్మీర్, లఢఖ్ లను వేరే దేశంగా చూపి.. భారతదేశ పటాన్నే ట్విటర్ వక్రీకరించడం దుమారం రేపింది. అంతకుముందు కూడా లేహ్ ను చైనాలో కలిపి చూపించింది. ట్విటర్ లోని ‘ట్వీప్ లైఫ్’ అనే సెక్షన్ లో జమ్మూకశ్మీర్, లఢక్ ప్రాంతాలను భారత్ లో భాగంగా చూపించకుండా ప్రత్యేక దేశంగా ట్విటర్ చూపించింది. దీనిపై భారతదేశ నెటిజన్లు మండిపడుతున్నారు. గతంలోనూ లేహ్ ను చైనాలో భాగంగా తప్పుగా గుర్తించారని.. ఇప్పుడు ట్విటర్ అతి చేస్తోందని.. కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ప్రభుత్వం చర్యలు ఆరంభించింది. భారత్ లోని జమ్మూకశ్మీర్, లడ్ఢక్ లను వేరే దేశంగా పేర్కొంటూ తమ వెబ్ సైట్లో తప్పుడు మ్యాప్ ను ఉంచినందుకు ఉత్తరప్రదేశ్ పోలీసులు ట్విట్టర్ భారత విబాగం ఎండీ మనీష్ మహేశ్వరిపై కేసు పెట్టారు. యూపీలోని ఖుజ్రానగర్ పోలీస్ స్టేషన్ లో భజరంగ్ దళ్ కార్యకర్తల ఫిర్యాదు మేరకు మనీష్ మహేశ్వరితోపాటు న్యూస్ పార్టనర్ షిప్ హెడ్ అమృతా త్రిపాఠిపై ఎఫ్ఐఆర్ నమోదైంది.

ఐటీ నిబంధనలు అమలు చేయని ట్విట్టర్ కు కేంద్రం ఇప్పటికే తుది నోటీసులు జారీ చేసింది. కేంద్రం రక్షణాత్మక హోదాను తీసేసింది. ట్విటర్ ఆగడాలపై దేశంలోనే నిషేధం దిశగానే కేంద్రం అడుగులు వేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ట్విటర్ కు పట్టుకున్న అహంకార దెయ్యాన్ని వదలగొట్టాలని.. నిషేధిస్తేనే తిక్క కుదురుతుందని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.