Begin typing your search above and press return to search.

మన వీవీఐపీకు అవమానం ఉండదా?

By:  Tupaki Desk   |   15 Sep 2015 2:47 PM GMT
మన వీవీఐపీకు అవమానం ఉండదా?
X
దేశానికి రాష్ట్రపతిగా వ్యవహరించిన ఒక భారత వీవీఐపీకి అమెరికాలో చేదు అనుభవం ఎదురైన సంగతి గతం. ఆ మాటకు వస్తే మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఒక్కరికే కాదు.. పలువురు కేంద్ర మంత్రులు.. వీవీఐపీలకు అమెరికా విమానాశ్రయంలో చేదు అనుభవాలు చాలానే చోటు చేసుకున్నాయి. భద్రతలో భాగంగా తనిఖీలు పేరు చెప్పి.. సహనానికి పరీక్షించటంతో పాటు.. అవమానాలకు గురి చేయటం పెద్దన్నకు కొత్తేం కాదు.

ఇలాంటివి చోటు చేసుకున్నప్పుడు చెంప పగిలిపోయేలా.. షాక్ తగిలేలా చర్యలు తీసుకోవటంలో నాటి పాలకులు అనుసరించిన నిర్లక్ష్యం అలసత్వంతో.. పెద్దన్న రాజ్యంలోని అధికారులు అప్పుడప్పుడు ఓవర్ యాక్షన్ చేస్తుండటం.. భారతావని మొత్తం భావోద్వేగంతో ఊగిపోవటం జరిగేది.

అయితే.. ఇకపై అలాంటి అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే.. భారత్ కు చెందిన వీవీఐపీ.. సెల్రబిటీలకు సంబంధించి అమెరికా ఎయిర్ పోర్ట్ లో ఇబ్బంది పడకుండా.. లగేజ్ చెకింగ్ వద్ద వేచి ఉండాల్సిన అవసరం లేకుండా.. నేరుగా ఆ దేశంలోకి వెళ్లే అవకాశం లభించనుంది. దీనికి సంబంధించి గ్లోబల్ ఎంట్రీ ప్రోగ్రామ్ పేరిట ఒక వెసులుబాటును కల్పించనున్నట్లు చెబుతున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా భారత్ కు చెందిన అతి ముఖ్యులు.. సెలబ్రిటీలకు సంబంధించిన రెండు వేల మందితో కూడిన ఒక జాబితాను సిద్ధం చేస్తున్నారు. వీరిలో కీలక స్థానాల్లో ఉన్న వ్యక్తులతో పాటు.. పారిశ్రామికవేత్తలు.. సినిమా యాక్టర్లు.. పలువురు ప్రముఖులు కూడా ఉంటున్నారు. అయితే.. ఈ ప్రముఖుల్లో ఎవరి మీదా ఆర్థిక నేరాలు నమోదు అయి ఉండకూడదన్న నిబంధన ఉందని చెబుతున్నారు.

ఈ జాబితాలోని వారు.. అమెరికాలో అడుగు పెట్టిన తర్వాత.. విమానాశ్రయంలో బయటకు వెళ్లే సమయంలో బయోమెట్రిక్ మాదిరి.. వేలి ముద్రను మాత్రం తీసుకుంటారని.. ఒక్కసారి అది పూర్తి అయిన తర్వాత మళ్లీ ఎలాంటి తనిఖీలు ఉండవని చెబుతున్నారు. ఈ విధానాన్ని అమలు చేయటానికి వీలుగా.. అమెరికా అధికారులు భారత్ కు వచ్చి చర్చలు జరపనున్నట్లు చెబుతున్నారు. మరి.. ఈ కొత్త విధానంలో ఎలా ఉంటుందో చూడాలి.