Begin typing your search above and press return to search.

మ‌న‌మ్మాయిలు ఫైన‌ల్‌ కు వెళ్లారండోయ్‌

By:  Tupaki Desk   |   21 July 2017 4:37 AM GMT
మ‌న‌మ్మాయిలు ఫైన‌ల్‌ కు వెళ్లారండోయ్‌
X
ఎంత‌సేప‌టికి కోహ్లీ సేనేనా? ఇమేజ్ పరంగా వారికున్న దానిలో ఒక్క శాతం కూడా లేని టీమిండియా మ‌హిళా క్రికెట్ జ‌ట్టు ఇర‌గ‌దీసింది. మ‌న‌మ్మాయిల అద్భుత ఆట‌తో ప్ర‌పంచ క‌ప్ క్రికెట్ ఫైనల్లోకి భార‌త్ దూసుకెళ్లింది. ఆదివారం లార్డ్స్ వేదిక‌గా జ‌రిగే ఫైన‌ల్ పోరులో మ‌న‌మ్మాయిలు ఇంగ్లండ్ అమ్మాయిల‌తో పోటీ ప‌డ‌నున్నారు.

ప్ర‌పంచ క‌ప్ క్రికెట్ టోర్నీ మొద‌ట్లో అద్భుతంగా రాణించి.. మ‌ధ్య‌లో త‌డ‌బాటుకు గురై.. సెమీస్ వ‌ర‌కైనా వ‌స్తారా? అన్న సందేహానికి గురి చేసిన మ‌నమ్మాయిలు.. సెమీస్‌కు రావ‌టమే కాదు.. బ్ర‌హ్మాండ‌మైన ఆట తీరుతో ప్ర‌త్య‌ర్థుల‌కు చుక్క‌లు చూపించి మ‌రీ ఫైన‌ల్‌ కు దూసుకెళ్లారు.

కేవ‌లం 115 బంతుల్లో ఏడు సిక్స‌ర్లు.. 20 ఫోర్ల‌తో 171 ప‌రుగుల్ని చేసి నాటౌట్ గా నిలిచిన హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ పుణ్య‌మా అని టీమిండియా మహిళ‌ల జ‌ట్టు ప్ర‌పంచ క‌ప్ ఫైన‌ల్‌ కు వెళ్లింద‌ని చెప్పాలి. వ‌న్డే క్రికెట్ చ‌రిత్ర‌లో ఉత్త‌మ ఇన్సింగ్స్ ల‌లో ఒక‌టిగా అభివ‌ర్ణించ‌ద‌గిన ఈ మ్యాచ్ లో 36 ప‌రుగుల తేడాతో డిఫెండింగ్ చాంఫియ‌న్ ఆస్ట్రేలియా జట్టు ను మ‌న‌మ్మాయిలు మట్టిక‌రిపించారు.

కంగార్ల‌ను కంగారు పెట్టించి.. ఇంటికి పంపించిన ఈ మ్యాచ్ ను క్లుప్తంగా చూస్తే.. వ‌ర్షం కార‌ణంగా 50 ఓవ‌ర్లు జ‌ర‌గాల్సిన మ్యాచ్‌ ను 42 ఓవ‌ర్ల‌కు కుదించారు. హ‌న్మ‌న్ ప్రీత్.. మిథాలీరాజ్‌(36).. దీప్తి శ‌ర్మ‌(25)లు రాణించ‌టంతో భార‌త జ‌ట్టు నాలుగు వికెట్ల‌కు 281 ప‌రుగుల భారీ స్కోర్‌ ను సాధించింది. భారీ ల‌క్ష్య చేధ‌న‌కు దిగిన ఆసీస్ ఆట‌గాళ్ల‌లో బ్లాక్ వెల్ విధ్వంస‌క‌ర బ్యాటింగ్ తో టీమిండియా అభిమానుల‌ను క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేసింది. ఒక‌ద‌శ‌లో బ్లాక్ వెల్ దెబ్బ‌కు మ్యాచ్ చేజారింద‌నే భావ‌న‌కు గుర‌య్యారంతా. మూడు ఓవ‌ర్ల‌లో 44 ప‌రుగులు చేయాల్సి ఉన్నా.. బ్లాక్ వెల్ క్రీజ్ లో ఉంటే విజ‌యం అసాధ్య‌మ‌న్న భావ‌న క‌లిగింది.

ఆమె వికెట్ త‌ప్ప మిగిలిన బ్యాట్స్ మెన్ల వికెట్ల‌ను తీస్తున్న భార‌త బౌల‌ర్లు ఎంత‌గా ప్ర‌య‌త్నించినా బ్లాక్ వెల్ వికెట్ మాత్రం తీయ‌లేక‌పోయారు. ఇదిలా ఉండ‌గా.. 41 ఓవ‌ర్ మొద‌టి బంతికి బ్లాక్ వెల్ వికెట్ ప‌డిపోవ‌టంతో.. ఆట స్వ‌రూపం మొత్తంగా మారిపోయింది. త‌ర్వాత మ్యాచ్ భార‌త్ వైపు మొగ్గి.. అంతిమంగా టీమిండియా ఘ‌న విజ‌యాన్ని సాధించింది. ఈ మ్యాచ్ లో హ‌ర్మ‌న్ ప్రీత్ బ్యాటింగ్‌ ను హైలెట్ గా చెప్పాల్సిందే. భార‌త్‌ కు ఇంత భారీ స్కోర్ రావ‌టంలో ఆమెదే కీల‌క‌పాత్ర అని చెప్ప‌క త‌ప్ప‌దు. క్వార్ట‌ర్ ఫైన‌ల్స్ వ‌ర‌కూ పెద్ద‌గా ప్ర‌భావం చూపించ‌ని హ‌ర్మ‌న్ కీల‌క‌మైన మ్యాచ్ లో త‌న త‌ఢాఖా చూపించి భార‌త్‌కు భారీ విజ‌యాన్ని అందించి.. ఫైన‌ల్స్ కు దూసుకెళ్లేలా చేసింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మ‌రో అడుగు దూరంలో ఉన్న ప్ర‌పంచ క‌ప్ మ‌న‌మ్మాయిల సొంతం కావాల‌ని కొరుకుందాం.