Begin typing your search above and press return to search.

ఇంగ్లిష్ ఎక్కువగా వ‌చ్చినందుకు వీసా రిజెక్ట్‌

By:  Tupaki Desk   |   19 Dec 2017 3:30 AM GMT
ఇంగ్లిష్ ఎక్కువగా వ‌చ్చినందుకు వీసా రిజెక్ట్‌
X
సాధార‌ణంగా ఇంగ్లిష్ భాషా ప్రావిణ్యం ఉంటే వీసా ఇస్తారు. అయితే..ఇంగ్లిష్ ఎక్కువ‌గా వ‌స్తే..వీసా రిజెక్ట్ చేయ‌డం ఉంటుందా? ఉంటుంది. ఎందుకంటే అలాంటి సంఘ‌ట‌నే జ‌రిగింది కాబ‌ట్టి. మేఘాలయా వాసి అయిన అలెగ్జాండ్రియా రిన్‌టౌల్ విష‌యంలో! ఐఈఎల్‌టీఎస్‌ (IELTS)లో అడ్వాన్స్‌డ్ వ‌ర్ష‌న్‌ కూడా పాసయింది. కాని..త‌న‌కు యూకే వీసా రిజెక్ట్ అయింది. ఎందుకంటే.. తనకు ఉండాల్సిన ఇంగ్లీష్ స్కిల్స్ కంటే ఎక్కువ ఉండటమే కారణమంటూ యూకే ఇమ్మిగ్రేషన్ డిపార్ట్‌ మెంట్ పేర్కొన్నట్లు తన ఫేస్‌ బుక్ పోస్ట్‌ లో తెలిపింది. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నమ్మాల్సిన నిజం.

యూకేలో సెటిల్ అవ్వాలనుకున్న వ్యక్తులకు ఇంగ్లీష్ లాంగ్వేజీలో టెస్ట్ పెడతార‌నే సంగ‌తి మ‌న‌కు తెలిసిందే! అయితే.. త‌న‌కు అడ్వాన్స్‌ డ్ ఐలెట్స్ సర్టిఫికెట్ ఉన్నందున.. ఆ సర్టిఫికెట్‌ నే ప్రూఫ్‌ గా పెట్టింది. అయితే.. ఇమ్మిగ్రేషన్ డిపార్ట్‌ మెంట్ మాత్రం తమకు ఈ సర్టిఫికెట్ అక్కర్లేదని.. ఎక్కువ స్కిల్స్ ఉన్న ఈ సర్టిఫికెట్ పనికిరాదని.. అందువల్ల వీసా జారీ కుదరదని.. రిజెక్ట్ చేస్తున్నట్లు తనకు మెయిల్ పంపించింది. ఇండియాలో ఎక్కువ మంది ఇంగ్లీష్ మాట్లాడ‌ర‌ని... ఇంగ్లీష్ ఎక్కువగా మాట్లాడే దేశాల్లో భారత్ లేదని.. మరి తనకు అడ్వాన్స్‌ డ్ ఐలెట్స్ సర్టిఫికెట్ ఎలా వచ్చిందని ఇమ్మిగ్రేషన్ అధికారులు సందేమం వ్య‌క్తం చేశారు. దీంతో షాక్ తిన్న అలెగ్జాండ్రియా ఇదేమి విడ్డూరమంటూ... ఫేస్‌ బుక్‌ లో దీని గురించి వివరిస్తూ పోస్ట్ పెట్టింది. తన మీద అధికారులు ప‌లు సందేహాలు పడినట్లు అలెగ్జాండ్రియా ఫేస్‌ బుక్ పోస్ట్‌ లో పేర్కొంది. ఇప్పుడు ఆ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

చెన్నైలో పని చేస్తున్న సమయంలో స్కాట్లాండ్‌ కు చెందిన బాబీతో తనకు పరిచయం ఏర్పడింది. బాబీని గత మే నెలలో అలెగ్జాండ్రియా పెండ్లి చేసుకున్నది. ఆ తర్వాత బాబీకి స్కాట్లాండ్‌ లో ఉద్యోగం రావడంతో అక్కడికి వెళ్లిపోయాడు. అలెగ్జాండ్రియా మాత్రం ప్రస్తుతం ఇండియాలో వర్క్ చేస్తోంది. ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలను స్కాట్లాండ్‌ లో ఉన్న తన భర్తతో కలిసి జరుపుకోవడం కోసం అలెగ్జాండ్రియా యూకే వీసాకు ద‌ర‌ఖాస్తు చేసింది. అయితే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనేందుకు స్కాట్లాండ్‌ కు వెళ్దామనుకుంటే ఇలా జరిగిందంటూ తన బాధను పంచుకుంది. ``యూకే ప్రభుత్వం కనీసం పార్ట్‌నర్ - డిపెండెంట్ లేదా స్పౌస్ వీసా అయినా ఇవ్వాల్సింది. ఇంకా వాళ్లు మాట్లాడే పద్ధతి కూడా మార్చుకోవాలి. ఎటువంటి ఆధారాలు లేకుండా ఇండియా ఇంగ్లీష్ మాట్లాడే దేశం కాదంటూ అవమానించడం ఎంతమాత్రం కరెక్ట్ కాదు.." అంటూ తను వాపోయింది.

త‌న ప్ర‌స్తుత ద‌ర‌ఖాస్తును ఆమె వివ‌రిస్తోంది. ``ఇప్పటికే వీసా కోసం చాలా ఖర్చు చేశా.. నాకు అక్కడ ఇల్లు కూడా ఉంది. వీసా వస్తుంది అనుకున్నాను.. కాని ఇలా జరుగుతుందనుకోలేదు. ఇటువంటి నియమాలు ఉంటాయని ముందే తెలిస్తే.. ఇండియాలోనే ప్రాపర్టీ కొనుక్కునేవాళ్లం. నేను మంచి రచయితను అవుదామనుకున్నా. ఆ పని ఎక్కడ నుంచైనా చేసుకోవచ్చు కదా అని ఆలోచించాను. ఇప్పుడు స్కాట్లాండ్‌ కు చెందిన ఓ ఎంపీ సహాయంతో మళ్లీ అప్లయి చేస్తున్నా.. అంటూ ఫేస్‌ బుక్ పోస్ట్‌ లో తన అనుభవాలను అలెగ్జాండ్రియా పంచుకుంది. ఆమెకు ప‌లువురు నెటిజ‌న్లు మ‌ద్ద‌తు ఇస్తుండ‌టం విశేషం.