Begin typing your search above and press return to search.

స్వ‌దేశానికి వ‌చ్చిన భారతీయ మహిళ

By:  Tupaki Desk   |   25 May 2017 1:40 PM GMT
స్వ‌దేశానికి వ‌చ్చిన భారతీయ మహిళ
X
పాకిస్థాన్ జాతీయుడు తనను తుపాకీతో బెదిరించి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని ఆరోపించిన భారతీయ మహిళ ఉజ్మాకు స్వదేశం వెళ్లేందుకు ఇస్లామాబాద్ హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. ఆమెను ఎస్కార్ట్‌ తో తీసుకెళ్లి వాఘా సరిహద్దు వద్ద వదిలేయాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల నేప‌థ్యంలో పాక్ అధికారులు గురువారం వాఘా సరిహద్దు వరకు ఉజ్మాకు భద్రత కల్పించి తీసుకు వచ్చి భారత అధికారులకు అప్పగించారు.

సుదీర్ఘ న‌ర‌కం త‌ర్వాత భారత భూభాగంలో అడుగుపెట్టిన ఉజ్మా ఆ సందర్బంలో ఉజ్మా ఉద్వేగానికి గుర‌య్యారు. భార‌త‌భూమిని ముద్దాడారు. ఈ సంద‌ర్భంగా ఆమె సంతోషం వ్య‌క్తం చేసింది. ఉజ్మా త‌ల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ తమ బిడ్డను ప్రాణాలతో చూస్తామని ఊహించలేదని, ఉజ్మాను మాకు అప్పగించినందుకు సంతోషంగా ఉందని ఆమె కుటుంబ సభ్యులు కేంద్ర ప్రభుత్వానికి, భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ కు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఉజ్మా ఉదంతంపై కేంద్ర‌మంత్రి సుష్మాస్వ‌రాజ్ రియాక్ట‌య్యారు. `భారత్ ముద్దు బిడ్డకు స్వాగతం, మీరు పాకిస్థాన్ లో ఎదుర్కొన్న పరిస్థితులన్నింటికీ నేను క్షమాపణ చెబుతున్నాను`అని సుష్మాస్వరాజ్ ట్వీట్ చేశారు.

కాగా, ఢిల్లీకి చెందిన ఉజ్మా తాను తాహిర్ అలీ అనే పాకిస్థాన్ జాతీయుడ్ని మలేషియాలో కలుసుకున్నానని, అతను ప్రేమ పేరుతో తనను పాక్ తీసుకెళ్లాడని కోర్టుకు తెలిపింది. మే 3న తుపాకీ తలకు గురిపెట్టి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని వివరించింది. పెళ్ల‌యినప్పటి నుంచి పాక్‌లోని భారత హైకమిషన్‌లో ఆశ్రయం పొందుతున్న ఆమె ఈ నెల 12 కోర్టును ఆశ్రయించింది. తనకు ఇంతకుముందే పెళ్లి అయిందని, తన కుమార్తెకు తలసేమియా వ్యాధి ఉన్నందున తనను భారత్ వెళ్లేందుకు అనుమతించాలని కోరింది. ఇరువర్గాల వాదన విన్న కోర్టు, ఉజ్మా భారత్ వెళ్లేందుకు అనుమతించింది. తాహిర్ అలీ ఉజ్మా వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న వీసా, ప్రయాణ అనుమతి పత్రాలనూ అందజేయాలని ఆదేశించింది. తాహిర్ మాత్రం ఉజ్మా ఇప్పటికీ తన భార్యేనని, తాము మలేషియాలో ప్రేమించుకున్నామని తెలిపాడు. తాను ఆమెకు విడాకులు ఇవ్వలేదని పేర్కొన్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/