Begin typing your search above and press return to search.

భార‌తీయులకు నా దేశంలో ప్ర‌వేశం లేదుః నిత్యానంద‌

By:  Tupaki Desk   |   22 April 2021 2:32 AM GMT
భార‌తీయులకు నా దేశంలో ప్ర‌వేశం లేదుః నిత్యానంద‌
X
ఇండియాలో కరోనా కేసులు లక్షలాదిగా పెరుగుతుండడంతో భారత్ ను రెడ్ లిస్టులో పెడుతున్నాయి ప్రపంచ దేశాలు. రోజుకు రెండు ల‌క్ష‌ల‌కు పైగా కేసులు న‌మోద‌వుతుండ‌డం.. వేలాదిగా బాధితులు ప్రాణాలు కోల్పోతుండ‌డంతో ప‌రిస్థితి అల్ల‌కల్లోలంగా మారింది.

ఈ సెకండ్ వేవ్ లో.. సౌతాఫ్రికా, బ్రెజిల్‌, బ్రిట‌న్ వేరియంట్లు తీవ్రంగా దాడిచేస్తున్న‌ట్టు నిపుణులు భావిస్తున్నారు. అంత‌కంత‌కూ కేసుల తీవ్ర‌త పెరుగుతుండ‌డంతో.. భార‌త్ నుంచే త‌మ దేశాల‌కు వ‌చ్చే వారికి అనుమ‌తి నిరాక‌రిస్తున్నాయి ప‌లు దేశాలు.

ఇప్ప‌టికే.. న్యూజీలాండ్‌, హాంకాంగ్ దేశాల‌తోపాటు బ్రిట‌న్ కూడా ఎర్ర‌జెండా చూపించింది. భార‌త్ నుంచి వ‌చ్చే విమానాల‌ను కూడా ఈ దేశాలు నిలిపేశాయి. అయితే.. ఈ జాబితాలో వివాదాస్ప‌ద స్వామి నిత్యానంద కూడా చేరిపోవ‌డం గ‌మ‌నార్హం. ఈక్వెడార్ స‌మీపంలోని ఓ ద్వీపంలో సొంత దేశాన్ని నిత్యానంద సృష్టించుకున్న సంగ‌తి తెలిసిందే.

క‌రోనా ఉధృతి వేళ త‌న దేశం ‘కైలాస’లోకి భారతీయులకు ప్రవేశం లేదని ప్రకటించారు. భారత్ మాత్రమే కాకుండా.. బ్రెజిల్, మలేషియా, యూరోపియన్ యూనియన్ ను కూడా నిత్యానంద బ్యాన్ చేయడం విశేషం. భార‌త్ లో ఎన్నో ర‌కాల ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న నిత్యానందపై చాలా కేసులు ఉన్నాయి. దీంతో.. 2019లో ఆయ‌న దేశం వ‌దిలి పారిపోయారు.

ఆ త‌ర్వాత తానో సొంత దేశాన్ని సృష్టించుకున్నాన‌ని, దాని పేరు కైలాస అని ప్ర‌క‌టించారు. అలాంటి నిత్యానంద ఇవాళ భార‌త్ ను నిషేధించ‌డం గ‌మ‌నించాల్సిన అంశం.