Begin typing your search above and press return to search.

ఉక్రెయిన్ లో బందీలుగా భారతీయులు.. రష్యా కీలక ప్రకటన

By:  Tupaki Desk   |   3 March 2022 5:33 AM GMT
ఉక్రెయిన్ లో బందీలుగా భారతీయులు.. రష్యా కీలక ప్రకటన
X
రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. రష్యా ఉక్రెయిన్ లోని కీలక నగరాలను స్వాధీనం చేసుకునేందుకు దాడులతో విరుచుకుపడుతోంది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు కేంద్రం ఆపరేషన్ గంగాను నిర్వహిస్తోంది. ఈ తరుణంలో బుధవారం రష్యా కీలక ప్రకటన చేసింది.

ఉక్రెయిన్ లో కొందరు భారతీయ విద్యార్థులను బందీలుగా ఉంచినట్లు రష్యా తెలిపింది. ఖార్కివ్ నుంచి భారతీయ విద్యార్థులను తరలించడానికి రష్యా ప్రయత్నిస్తుండగా.. ఉక్రెయిన్ బలగాలు భారతీయులను బందీలుగా పట్టుకున్నాయని రష్యా రక్షణ మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.

మంత్రిత్వశాఖ అధికారిక ప్రతినిధి, మేజర్ జనరల్ ఇగోర్ కోనాషెంకావ్ క్లారిటీ ఇచ్చారు. తమకందిన సమాచారం ప్రకారం.. ఉక్రేనియన్ నుంచి బెల్గోరోడ్ కు వెళ్లాలనుకునే భారతీయ విద్యార్థులను ఖార్కివ్ లో ఉక్రెనియన్ అధికారులు బలవంతంగా నిర్బంధిస్తున్నారంటూ పేర్కొన్నారు.

భారత పౌరులను సురక్షితంగా తరలించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడానికి సాయుధ దళాలు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు. భారత దేశం ప్రతిపాదించినట్లుగా వారి సైనిక రవాణా విమానాలు లేదా భారతీయ విమానాలతో రష్యా భూభాగం నుంచి వారిని సురక్షితంగా ఇంటికి పంపుతామని పేర్కొన్నారు.

ఈ ఆరోపణలపై ఉక్రెయిన్ స్పందించింది. భారత్-పాకిస్తాన్, చైనా విద్యార్థులను రష్యా బందీలుగా మార్చిందని ఉక్రెయిన్ పేర్కొంది. భారత్, పాక్, చైనా ఇతర దేశాల విద్యార్థులు రష్యన్ సాయుధ దురాక్రమణకు బందీలుగా మారారంటూ ఆరోపించింది.