Begin typing your search above and press return to search.

గల్ఫ్ దేశంలోని భారతీయులకు ఊరట!

By:  Tupaki Desk   |   13 Oct 2020 11:30 PM GMT
గల్ఫ్ దేశంలోని భారతీయులకు ఊరట!
X
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని భారతీయులు ఊరట లభించింది. గల్ఫ్ లో పనిచేసే భారతీయులంతా.. ఇక నుంచి మన దేశానికి రావాలనుకుంటే భారత రాయబార కార్యాలయంలో నమోదు చేయవలసిన అవసరం లేదు. భారతదేశం- యుఏఈ మధ్య ఎయిర్ బబుల్ ఒప్పందం ప్రకారం.. టికెట్లను ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌తో నేరుగా బుక్ చేసుకోవచ్చు. ఈ మేరకు రెండు దేశాలు నిర్ణయించాయి.

ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా-ఎక్స్‌ప్రెస్ ప్రైవేట్ - విదేశీ క్యారియర్లు, చార్టర్డ్ విమానాలు, ల్యాండ్-బోర్డర్ క్రాసింగ్, మరియు నావికాదళ నౌకలతో సహా అన్నింట్లోనూ ఈ వెసులుబాటును కల్పించారు. కరోనా మహమ్మారి ప్రారంభం నుండి ఇప్పటివరకు 17.2 లక్షల మంది భారతీయులను వందే భారత్ మిషన్ కింద స్వదేశానికి రప్పించారు. ఇంకా చాలా మంది గల్ఫ్ దేశాల్లో భారతీయులు పనిచేస్తున్నారు.

వందే భారత్ మిషన్ యొక్క 7వ దశ ఇప్పుడు ప్రారంభమైంది. ఈ క్రమంలోనే అక్టోబర్ నెలలో 25 దేశాల నుండి 873 అంతర్జాతీయ విమానాలను కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్ చేసి నడిపిస్తోంది. స్వదేశానికి తిరిగి రప్పించడానికి భారత్ 14 దేశాలతో ద్వైపాక్షిక ‘ఎయిర్ బబుల్’ ఒప్పందం కుదుర్చుకుంది.

కరోనా వ్యాప్తితో ఇప్పటికే చాలా దేశాల్లో భారతీయులు విదేశాలలో చిక్కుకున్నారు. భారతీయులను తరలించడానికి వందే భారత్ మిషన్ మే నెలలో ప్రారంభించింది. భారతదేశంతో సహా అనేక దేశాలు విమాన ప్రయాణాలను కరోనా కారణంగా అప్పట్లో నిషేధించాయి. అంతర్జాతీయ విమానాల ప్రయాణాలపై నిషేధం విధించాయి.ఇప్పుడు కరోనా తీవ్రత తగ్గుతుండడంతో విదేశీ ప్రయాణాలపై ఆంక్షలను సడలిస్తున్నారు.