Begin typing your search above and press return to search.

ఇండియాకు బైబై చెప్పేస్తున్నారు?

By:  Tupaki Desk   |   24 Jun 2019 5:34 AM GMT
ఇండియాకు బైబై చెప్పేస్తున్నారు?
X
దేశం మీద ప్రేమ‌తో విదేశాల నుంచి స్వ‌దేశానికి వ‌చ్చే వారి సంఖ్య ఆ మ‌ధ్య‌లో కాస్త క‌నిపించేది. ఇప్పుడు ట్రెండ్ మారింది. దేశంలో ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు లేకున్నా.. రాజ‌కీయ సంక్షోభం క‌నిపించ‌కున్నా.. అంత‌ర్యుద్ధం లాంటిదేమీ చోటు చేసుకోకున్నా.. దేశాన్ని వ‌దిలి విదేశాల‌కు వెళ్లిపోవాల‌నుకుంటున్న వారు అంత‌కంత‌కూ పెరుగుతున్నారు. గ‌డిచిన ప‌దేళ్ల కాలంలో విదేశాల‌కు వెళ్లిపోయేందుకు ఆస‌క్తి చూపుతున్న వారి సంఖ్య అనూహ్యంగా ఉంద‌ని చెబుతున్నారు. దీనికి కార‌ణం ఏమిట‌న్న‌ది ఒక ప‌ట్టాన అంతుప‌ట్ట‌టం లేదంటున్నారు.

దేశాన్ని విడిచి వెళుతున్న వారిలో అత్య‌ధికులు అమెరికా.. కెన‌డా దేశాల వైపు మొగ్గుచూపుతున్న‌ట్లుగా తాజా అధ్య‌య‌నం ఒక‌టి చెబుతోంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. ప‌దేళ్ల క్రితం అమెరికా.. కెన‌డాలో నివాసం ఉండ‌టానికి భార‌త్ నుంచి చేసుకున్న ద‌ర‌ఖాస్తులు 282 కాగా.. గ‌డిచిన ప‌దేళ్ల‌లో ఈ సంఖ్య భారీగా పెరిగింది. 2019లో అమెరికా ఆశ్ర‌యాన్ని కోరుతూ ద‌ర‌ఖాస్తు చేసుకున్న భార‌తీయుల సంఖ్య ఏకంగా 28,489కి ఉండ‌టం గ‌మ‌నార్హం.

భార‌త్ నుంచి విదేశాల‌కు వెళుతున్న వారి సంఖ్య అంత‌కంత‌కూ పెరుగుతుంటే.. విదేశాల నుంచి భార‌త్ లో ఉండ‌టానికి ఆస‌క్తి చూపుతున్న వారి సంఖ్య ఎక్కువ‌గా లేద‌ని చెబుతున్నారు. తాజాగా జ‌రిపిన అధ్య‌య‌నంలో మ‌రిన్ని ఆస‌క్తిక‌ర అంశాలు ఉన్నాయి. అవేమంటే..

+ ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం అమెరికా - కెనడాల తర్వాత భారతీయులు ఆశ్రయం కోరిన దేశాల్లో దక్షిణాఫ్రికా(4,329) - ఆస్ట్రేలియా(3,584) - దక్షిణకొరియా(1,657) - జర్మనీ(1,313) తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

+ అమెరికా - ఆస్ట్రేలియా - జర్మనీ అభివృద్ధి చెందిన దేశాలు కాబట్టి వలస వెళ్ల‌టానికి ఆస‌క్తి చూపించ‌టం ఓకే. ఆశ్చ‌ర్య‌క‌రంగా పేద‌రికం.. అంత‌ర్యుద్ధం.. విప‌రీత‌మైన హింస ఉండే యెమెన్.. సూడాన్.. బోస్నియా.. బురుండి లాంటి దేశాల‌కు సైతం భార‌తీయులు వెళ్ల‌టానికి ఆస‌క్తి ప్ర‌ద‌ర్శిస్తుండ‌టం విశేషం.

+ 2018లో 57 దేశాల్లో భారతీయులు ఆశ్రయాన్ని కోరారు. భారత్‌లో నెలకొన్న అసహనం కారణంగానే ఇలా ప్రజలు విదేశీ ఆశ్రయం కోరుతున్నారా? అన్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారింద‌ట‌.

+ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ ను ఆశ్రయిస్తోన్న శరణార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. అంతర్జాతీయంగా 35.03 లక్షల మంది శరణార్థులు వేర్వేరు దేశాల్లో ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకుంటే భార‌త్ లో పౌర‌స‌త్వం కోసం అప్లై చేసిన వారు కేవ‌లం 11,957 మంది మాత్ర‌మే.

+ ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం 2018 చివరికినాటికి భారత్‌ 1.95 లక్షల మంది శరణార్థులకు ఆశ్రయం ఇచ్చింది. ప్రాంతాలవారీగా చూసుకుంటే పాకిస్తాన్‌ 14.04 లక్షల మంది విదేశీయులకు ఆశ్రయం ఇచ్చింది. వీరిలో అత్యధికులు ఆఫ్గన్లు. బంగ్లాదేశ్‌( 9.06 లక్షలు ) రెండో స్థానంలో నిలిచింది. రోహింగ్యాలు వీరిలో ఎక్కువ‌గా ఉన్నారు.