Begin typing your search above and press return to search.

అమెరికా వ‌ద్దు..కెనడా ముద్దు

By:  Tupaki Desk   |   5 Feb 2020 1:30 AM GMT
అమెరికా వ‌ద్దు..కెనడా ముద్దు
X
అమెరికా వెళ్లాలి.. మంచి ఉద్యోగంలో చేరాలి.. డాలర్లలో సంపాదించాలి.. రూ.కోట్లు కూడబెట్టాలి’ కోట్లాది మంది భారతీయుల ‘డాలర్‌ డ్రీమ్స్‌' ఇవి. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులకు అమెరికా ఓ చిరకాల స్వప్నం. ఆ దేశంలో ఉద్యోగం చేసుకునేందుకు అనుమతి ఇచ్చే హెచ్‌-1బీ వీసా కోసం క‌ళ్లు కాయలు కాసేలా ఎదురుచూసేవారు ఎందరో. కానీ.. డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం భారతీయ ఇంజినీర్ల ఆశలను చిదిమేస్తోంది. దీంతో మ‌న‌వాళ్లు ప్ర‌త్యామ్నాయాలు వెతుక్కుంటున్నారు. అలా కెన‌డాలో ఓ రికార్డు నెల‌కొల్పారు.

అమెరికాలో విద్య - ఉద్యోగ అవ‌కాశాల విష‌యంలో ఎదుర‌వుతున్న ఆంక్ష‌ల నేప‌థ్యంలో... మ‌న‌వాళ్ల చూపు కెన‌డాపై ప‌డింది. నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ(ఎన్ ఎఫ్ ఎపీ) అనే సంస్థ అధ్య‌య‌నంలో తాజాగా ఆస‌క్తిక‌ర వివ‌రాలు వెలుగులోకి వ‌చ్చాయి. 2016 వరకు కెనడాలో కేవలం 39,705 మంది మ‌న‌వాళ్లు ఉండ‌గా...2019 వచ్చే సరికి ఈ సంఖ్య 80,685కి పెరిగింది. అంటే, మూడేళ్ల కాలంలో కెనడా వెళ్లిన భారత ప్రవాసుల సంఖ్య రెండింతలు పెరిగింది.

నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ(ఎన్ ఎఫ్ ఎపీ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్టువార్ట్ అండర్సన్ దీని గురించి వివ‌రిస్తూ, ఉన్నత చదువులు, ఉద్యోగం, ఉపాధి ఇలా పలు కారణాలతో ఇండియన్స్ భారీ మొత్తంలో కెనడా వెళ్లినట్లు విశ్లేషించారు. ఏకంగా 105 శాతం పెరుగుదల నమోద‌వ‌డం ఓ రికార్డు అని విశ్లేషించారు. అయితే, ఇందులో ఎంద‌రు నేరుగా భార‌త్ నుంచి కెనడా వెళ్లారు...మ‌రెంద‌రు అమెరికా నుంచి వెళ్లారో తెలుసుకోవ‌డం ఒకింత క‌ష్ట‌మేన‌ని ఆయ‌న పేర్కొన్నారు.