Begin typing your search above and press return to search.

ట్రంప్ వారి నూత‌న వ‌ల‌స విధానం ఇదే!

By:  Tupaki Desk   |   17 May 2019 8:53 AM GMT
ట్రంప్ వారి నూత‌న వ‌ల‌స విధానం ఇదే!
X
ఎన్నాళ్ల‌కు ఎన్నాళ్ల‌కు అన్న‌ట్లుగా.. భార‌త ఐటీ నిపుణుల‌కు మేలు చేసేలా అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ త‌న కొత్త వ‌ల‌స విధానాన్ని తాజాగా ప్ర‌క‌టించారు. ఆయ‌న ప్ర‌క‌టించిన కొత్త వ‌ల‌స విధానం కార‌ణంగా భార‌త ఐటీ నిపుణులు పెద్ద ఎత్తున లాభ‌ప‌డ‌టం ఖాయ‌మ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మవుతోంది. గ్రీన్ కార్డుల జారీలో అత్యున్న‌త ప్ర‌తిభ ఉన్న వ‌ల‌స ఉద్యోగుల కోటాను 12 నుంచి 57 శాతానికి పెంచుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

అదే స‌మ‌యంలో వ‌ల‌స‌దారులు ఇంగ్లిష్ త‌ప్ప‌నిస‌రిగా నేర్చుకోవాల్సి ఉంటుంద‌ని.. అలాగే అమెరికా చ‌రిత్ర‌.. సంస్కృతి అంశాల మీద నిర్వ‌హించే ప‌రీక్ష‌ల్లో ఉత్తీర్ణ‌త సాధించాల్సి ఉంటుంద‌ని స్ప‌స్టం చేశారు. 54 ఏళ్ల క్రితం అమెరికా వ‌ల‌స విధానంలో మార్పులు చేసిన త‌ర్వాత‌.. మ‌ళ్లీ ట్రంప్ తాజాగా సంస్క‌ర‌ణ‌లు చేప‌ట్టారు.

తాజా విధానం కార‌ణంగా నైపుణ్యం ఉన్న యువ‌త‌కు అవ‌కాశాలు ద‌క్క‌నున్నాయి. ఇంగ్లిషులో ప‌ట్టు ఉన్న వారికి మేలు జ‌రుగుతుంది. ఈ లెక్క‌న భార‌త ఐటీ నిపుణుల‌కు మంచి అవ‌కాశాలుఉన్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. తాజా విధానంలో వ‌ల‌స‌దారుల వ‌య‌సు.. ప్ర‌తిభ‌.. ఉద్యోగ అవ‌కాశాలు.. అమెరికా చ‌రిత్ర‌పై అవ‌గాహ‌న త‌దిత‌ర అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని ఆ దేశంలో శాశ్విత నివాసం పొందే అవ‌కాశాన్ని క‌ల్పిస్తామ‌ని ఆయ‌న చెప్పారు.

ప్ర‌స్తుతం అమల్లో ఉన్న విధానం ప్ర‌కారం అమెరికాలో ఉంటున్న విదేశీయుల‌ను వివాహం చేసుకునే వారికి 60 శాతం.. వేర్వేరు రంగాల నిపుణులైన వారికి 12 శాతం కోటాతో గ్రీన్ కార్డులు జారీ చేస్తున్నారు. కొత్త విధానంలో నిపుణుల కోటాను 12 నుంచి 57 శాతానికి పెంచారు. దీన్నిమ‌రింత పెంచేందుకు సిద్ధ‌మ‌ని ట్రంప్ పేర్కొన్నారు. తాజా నిర్ణ‌యం వేలాది మంది భారత నిపుణుల‌కు మేలు చేస్తుంద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.