Begin typing your search above and press return to search.

చైనా విమానాలు.. చౌకయిన ప్రయాణాలు

By:  Tupaki Desk   |   26 Dec 2016 4:00 AM IST
చైనా విమానాలు.. చౌకయిన ప్రయాణాలు
X
చైనా అంటే చీప్ అండ్ బెస్ట్... ప్రపంచమంతా ఈ విషయం తెలుసు. ఎన్నో అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా చైనా వస్తువులు లేకుండా తెల్లారని పరిస్థితి. ఇండియా, అమెరికా మార్కెట్లనే కాదు.. ఆస్ర్టేలియా వంటి దేశాల మార్కెట్లనూ చైనా ఉత్పత్తులను పూర్తిగా కమ్మేశాయి. ఆస్ట్రేలియాలో ఎక్కడ చూసినా చైనా మాలే. మొబైల్ మార్కెట్ ను చైనా ఎంతగా క్యాప్చర్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏ రంగంలో అడుగుపెట్టినా మిగతా వారు ఎవరూ ఇవ్వనంత తక్కువ ధరలకు వస్తువులను అందివ్వడం చైనా సంస్థల ప్రత్యేకత. ఇప్పుడు విమానయాన రంగంలోనూ చైనా జోరు పెరుగుతోంది. దీంతో మిగతా దేశాల సంస్థలన్నీ హడలిపోతున్నాయి. చైనా దెబ్బకు తాము ధరలు తగ్గించుకోలేక.. అలా అని లాభాలు వదులుకోలేక ఏడ్చుకుంటున్నారట.

ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారి ఇటీవల లాస్ ఏంజిల్స్ వెళ్లాలనుకున్నారు... భారత విమానయాన సంస్థల్లో ఒకవైపు ప్రయాణ ధర రూ. 65 వేల నుంచి ప్రారంభం కాగా, సౌత్ చైనా ఎయిర్ లైన్స్ ఆమెకు రానూ పోనూ ప్రయాణాన్ని రూ. 58 వేలకే ఆఫర్ చేసింది. అంటే ఒకవైపు రూ.29 వేల ధరేనన్నమాట. అమెరికాకు అంత తక్కువ ధరలో వెళ్లిరావడాన్ని ఊహించగలరా. ఇదంతా చైనా ఎయిర్ లైన్సు సంస్థల మహిమే మరి. యూఎస్ - కెనడా - ఆస్ట్రేలియా - న్యూజిలాండ్ వంటి దూర ప్రాంతాలకు వెళ్లాలని భావించేవారు ఎందరో ఇప్పుడు చైనా విమానయాన సంస్థలను ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం ఇండియా నుంచి 42 సర్వీసులను చైనా ఎయిర్ లైన్స్ నిర్వహిస్తుండగా, వాటిల్లో 10 వేల వరకూ సీట్లు లభిస్తున్నాయి.

హై క్వాలిటీ సేవలతో పాటు, తక్కువ ధరలకు ప్రయాణాన్ని ఆఫర్ చేస్తున్నందునే కార్పొరేట్ ట్రావెలర్ల నుంచి పలు వర్గాల ప్రయాణికులు చైనా సంస్థలను ఆశ్రయిస్తున్నారట. రేటు తక్కువని వారేమీ డొక్కు విమానాలు వేయడం లేదు.. మంచి సర్వీసులే నడుపుతున్నారని చెబుతున్నారు. దీంతో ఇండియా నుంచి వెళ్లేవారు చాలామంది.. ఇక్కడి నుంచి సర్వీస్ దొరక్కపోతే చైనాలోని ఏదైనా నగరానికి చేరుకుని అక్కడి నుంచి తమ గమ్యస్థానానికి వెళ్లేలా ప్లాన్ చేసుకుంటున్నారట.

- సింగపూర్ ఎయిర్ లైన్స్ - థాయ్ ఎయిర్ వేస్ - మలేషియా ఎయిర్ లైన్స్ లతో పోలిస్తే - చైనా విమానాల్లో రూ. 20 వేల నుంచి రూ. 25 వేల తక్కువకు టికెట్లు లభిస్తున్నాయి.

- చైనా - ఇండియా మధ్య ఉన్న ద్వైపాక్షిక ఒప్పందాల మేరకు ఇరు వైపులా 42 సర్వీసులు తిరిగేందుకే వీలుంది.

- చైనా సంస్థల విమానాలు పూర్తి ప్రయాణికులతో తిరుగుతుంటే, ఎయిర్ ఇండియా నడుపుతున్న 5 విమానాల్లో కేవలం 1,280 సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

- ఇండియా నుంచి విదేశాలకు వెళ్లానని చూస్తున్న వారిని ఆకర్షిస్తున్న చైనా సంస్థలు - వారిని చైనాలోని తమ గమ్య స్థానాలకు తీసుకెళ్లి, అక్కడి నుంచి ప్రయాణికుల గమ్యస్థానానికి చేరుస్తున్నాయి. ఎయిర్ ఇండియా ధరలతో పోలిస్తే 40 నుంచి 50 శాతం వరకూ తక్కువకే తమ అవసరాలు తీరుతుండటంతోనే ప్రయాణికులు అటే మొగ్గు చూపుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/