Begin typing your search above and press return to search.

హెచ్‌1బీపై ట్రంప్‌ కు జైట్లీ గ‌ట్టి మాట చెప్పారుగా

By:  Tupaki Desk   |   16 Oct 2017 4:40 AM GMT
హెచ్‌1బీపై ట్రంప్‌ కు జైట్లీ గ‌ట్టి మాట చెప్పారుగా
X
హెచ్ 1బీ వీసా విధానంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ భార‌త‌దేశ గ‌లాన్ని అమెరికాలో బ‌లంగా నొక్కి చెప్పారు. ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న ఐఎంఎఫ్ - ప్రపంచ బ్యాంక్ వార్షిక సదస్సుకు హాజ‌రైన జైట్లీ ఈ వేదికపైనే అమెరికాకు స్ప‌ష్ట‌మైన‌ డిమాండ్ చేశారు. హెచ్‌1బీ వీసాపై అమెరికాకు వస్తున్న భారత ఐటీ నిపుణులు అక్రమ ఆర్థిక వలసదారులేం కాదని ఆయ‌న తేల్చిచెప్పారు. వీసా విధానంపై నిర్ణయం తీసుకునేటప్పుడు అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్‌ ట్రంప్ సర్కారు సముచితంగా వ్యవహరించాలని కేంద్ర ఆర్థిక‌మంత్రి భార‌త‌దేశం త‌ర‌ఫున గ‌ళం విప్పారు.

``నాన్ ఇమ్మిగ్రెంట్ విభాగానికి చెందిన హెచ్ 1బీ వీసాల ద్వారా అమెరికా కంపెనీలు ప్రత్యేక నైపుణ్యం అవసరమైన ఉద్యోగాల్లోకి విదేశీయులను నియమించుకుంటాయి. ఈ వీసాలపై అమెరికా వెళ్లే వారిలో భారతీయ ఐటీ నిపుణులే అధికం. ఇండియా నుంచి హెచ్ 1బీ వీసాలపై వచ్చేవారంతా అత్యున్నత నైపుణ్యం కలిగినవారు. అమెరికా ఆర్థిక పురోగతికి వారెంతగానో తోడ్పడుతున్నారు`` అని జైట్లీ పునరుద్ఘాటించారు. కానీ అమెరికా ప్రభుత్వం వారి గురించి ఆందోళన చెందుతున్నదని ఆయన అన్నారు. యూఎస్ ట్రెజరీ కార్యదర్శి స్టీవెన్ ముచిన్ - వాణిజ్య కార్యదర్శి విల్బర్ రాస్‌ తో సమావేశమైనప్పుడు హెచ్ 1బీ వీసాల అంశాన్ని లేవనెత్తినట్లు జైట్లీ తెలిపారు. ఈ విషయంలో భారత ప్రభుత్వ ఆందోళనలను వారికి తెలియజేయడం జరిగిందన్నారు. భారత సాఫ్ట్‌ వేర్ ఇంజినీర్లు ప్రత్యేక ఆదరణకు అర్హులన్నారు. సాధారణంగా భారతీయ ఐటీ కంపెనీలు అమెరికాలో ఆన్‌ సైట్ కార్యకలాపాల కోసం మనోళ్లను నియమించుకునేందుకు హెచ్ 1బీ వీసాలపై ఆధారపడుతుంటాయి.

కాగా, అమెరికాతోపాటు యూఎస్ పెట్టుబడిదారుల్లో భారత్‌ పై ఎంతో ఆసక్తి నెలకొందని అరుణ్ జైట్లీ అన్నారు. అమెరికా ప్రభుత్వంతోపాటు అమెరికా కంపెనీలు భారత మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు ఎంతో ఆసక్తి కనబర్చాయన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు ఇప్పటికే పరిణతి చెందాయని జైట్లీ పేర్కొన్నారు. ``అమెరికాలో భారతీయులు పెట్టుబడులు పెడుతున్నారు. భారత్‌ లో యూఎస్ కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తున్నాయి. వచ్చేనెలలో అమెరికా కార్పొరేట్ రంగానికి భారీ బృందం భారత్‌కు రాబోతుంది`` అని ఆయన వెల్లడించారు. ఇంధన బకాయిల చెల్లింపుతోపాటు ఇరాన్‌తో పెండింగ్‌ లో ఉన్న ఇతర సమస్యల్లో చాలావరకు పరిష్కారం అయ్యాయని జైట్లీ తెలిపారు. ఇరాన్ ఆర్థిక మంత్రి మసౌద్ కర్బాసియన్‌ తో భేటీ అనంతరం జైట్లీ ఈ వ్యాఖ్యలు చేశారు.